సన్ ఫిల్ములు తీసేస్తున్నారు కానీ.. కర్టెన్లు వాడుతున్నారు
గత కొద్ది రోజులుగా వాహనాలకు సన్ ఫిల్ముల వాడకం పట్ల కొనసాగుతున్న నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్లకు నల్లటి అద్దాలను ఉపయోగించి దుండగులు అక్రమాలకు పాల్పడుతుండటం, వీటి వలన క్రైమ్ రేట్ పెరిగిపోతుండటంతో దేశపు అత్యున్నత న్యాయస్థానం వాహనాలకు సన్ ఫిల్ము/టింట్ చేయబడిన అద్దాలను ఉపయోగించడంపై నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, వాహన చోదకులు మాత్రం తెలివిగా సన్ ఫిల్ములను తొలగించేసి వాటి స్థానంలో వాహనం లోపలి వైపు పూర్తిగా కర్టెన్లతో మూసేస్తున్నారు.
అదేమని అడిగితే, నిషేధం విధించింది కేవలం సన్ ఫిల్ములపై మాత్రమే కానీ కర్టెన్ల వాడకంపై కాదు కదా అంటూ తెలివిగా సమాధానమిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీని చూడండి.. వాహనానికి ఉండే అన్ని అద్దాలకు సన్ ఫిల్ములను పూర్తిగా తొలగించేసి కర్టెన్లను ఎలా తగిలించేశారో..! వాస్తవానికి మోటార్ వాహన చట్టంలో తాజాగా చేసిన సవరణల ప్రకారం, కంపెనీ ఫిక్స్ చేసిన అద్దాలు తప్ప వేరే నల్లటి అద్దాలను ఉపయోగించటం లేదా కంపెనీ ఫిక్స్ చేసిన అద్దాలపై నల్లటి ఫిల్ములను ఉపయోగించడాన్ని మాత్రమే నిషేధించటం జరిగింది.
అంతేకానీ, వాహనాలకు కర్టెన్లను వాడకం గురించి ఇందులో లేదు. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొని కొందరు వాహన చోదకులకు కార్లకు ఇలా కర్టెన్లు, సన్ షేడ్ బోర్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేసిందిన్నట్లుగా.. ఈ కర్టెన్ ఐడియా వాహన చోదకులను టింటెడ్ గ్లాస్ బాధ నుండి తప్పించింది. మరి దీనిపై పోలీసులు, సర్కారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో లేదా వాహనాలకు సన్ ఫిల్ముల వాడకంతో పాటుగా కర్టెన్లు, సన్ షేడ్ బోర్డుల వంటి వాటి వినియోగంపై కూడా నిషేధం విధించేలా ఈ నిబంధనను మరోసారి సవరిస్తారో వేచి చూడాల్సి ఉంది. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








