ఇకపై అన్నీ హీరో బ్రాండెడ్ వాహనాలే: హీరో మోటోకార్ప్
అమ్మకాల పరంగా ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీగా ఉన్న హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా), దేశీయ విపణిలో తాము అందిస్తున్న మోడళ్లన్నింటినీ హీరో బ్రాండ్ పేరుతో రీలాంచ్ చేసేందుకు సన్నాహాలను వేగవంతం చేసింది. గడచిన సంవత్సరంలో జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయిన తర్వాత, హీరో గ్రూప్ భారత మార్కెట్లో ఒంటరి ప్రయాణం చేసేందుకు సిద్ధమై ఓ బ్రాండ్ లోగోను డిజైన్ చేసిన, లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హీరో మ్యాస్ట్రో, హీరో ఇగ్నైటర్, హీరో స్ప్లెండర్, హీరో ప్యాషన్ మోడళ్లు హీరో బ్రాండింగ్‌తో లభిస్తుండగా, మిగిలిన అన్ని మోడళ్లను కూడా హీరో బ్రాండ్ పేరుతో పునఃప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. "మా మొత్తం ఉత్పత్తులను హీరో బ్రాండ్ పేరుతో రీలాంచ్ చేయనున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం లోపుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామ"ని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ వెల్లడించారు.
ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కు, హోండాకు మధ్య కుదిరిన కొత్త లైసెన్స్ ఒప్పందం ప్రకారం, 2014 వరకూ హీరో మోటోకార్ప్ 'హీరో హోండా' బ్రాండ్ (లోగో)ను తమ వాహనాలపై ఉపయోగించుకోవచ్చు. అయినప్పటికీ, వీలైనం త్వరగా స్వంత బ్రాండ్‌తో, స్వంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కంపెనీ తమ కార్యకలాపాలను వేగవంతం చేసింది.
హోండా భాగస్వామ్యం లేకపోయినప్పటికీ గడచిన ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ 62 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications








