గ్యారీ ఫిషర్ ప్రీమియం సైకిళ్లను విడుదల చేసిన ఫైర్‌ఫాక్స్
ప్రీమియం సైకిళ్లను తయారు చేయటంలో పేరుగాంచిన ఫైర్‌ఫాక్స్ బైక్స్ మరో రెండు సరికొత్త ప్రీమియం సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రేటర్ నోయిడా (యూ.పి.) కేంద్రంగా పనిచేస్తున్న ఫైర్‌ఫాక్స్ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'ట్రెక్ బైక్స్' ద్వారా అందిస్తున్న గ్యారీ ఫిషర్ కలెక్షన్‌లో భాగంగా.. సూపర్‌ఫ్లై ఎఎల్, సూపర్‌ఫ్లై కాంప్ అనే రెండు హై-ఎండ్ మౌంటైన్ బైస్కిల్స్‌ను కంపెనీ విడుదల చేసింది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఫైర్‌ఫాక్స్ సూపర్‌ఫ్లై ఎఎల్ - రూ.1.45 లక్షలు
- ఫైర్‌ఫాక్స్ సూపర్‌ఫ్లై కాంప్ - రూ.2.35 లక్షలు
ఇవి ప్రతిష్టాత్మక ట్రెక్ బైక్స్ బ్రాండ్‌కు చెందినవని గ్యారీ ఫిషర్ విజన్, క్రియేటివిటీ, ట్రెక్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌తో ఇవి రూపొందించబడ్డాయని, ఇలాంటి ఉత్పత్తులను కోరుకునే వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని ఫైర్‌ఫాక్స్ బైక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివ్ ఇందర్ సింగ్ తెలిపారు. యువతను లక్ష్యంగా చేసుకొని మొత్తం 3,000 సైకిళ్లను విక్రయించాలని (రెండు మోడళ్లు కలిపి) కంపెనీ లక్ష్యంతో ఉందని ఆయన అన్నారు. ఈ సైకిళ్లను కొనుగోలుపై వెచ్చించే డబ్బుతో ఓ టాటా నానో కారును కానీ లేదా మారుతి ఎమ్800 కారుని కొనుగోలు చేయవచ్చు. టాటా నానో కారు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.1.42 లక్షల రేంజ్‌లో ఉండగా, మారుతి ఎమ్800 కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.2.08 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.





మడతపెట్టుకునే సైకిళ్లు:
గతంలో ఫైర్‌ఫాక్స్ బైక్స్ మడతపెట్టుకునేందుకు వీలుండే సైకిళ్లను మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి వీటిని మార్కెట్లోకి తీసుకువస్తామని, తైవాన్‌లోని టెర్న్ బ్రాండ్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటామని కంపెనీ పేర్కొనటం జరిగింది. ప్రస్తుతానికి కంపెనీ తన స్వంత బ్రాండ్ క్రిందనే ఒక ఫోల్డింగ్ బైస్కిల్‌ను విక్రయిస్తోంది. అంతేకాకుండా కార్ల రూఫ్‌పై సైకిళ్లను ఫిక్స్ చేసుకునేందుకు బైస్కిల్ ర్యాక్‌లను కూడా పరిచయం చేస్తామని సింగ్ తెలిపారు. ఇందుకోసం అమెరికాకు చెందిన సారిస్ కంపెనీతో చేతులు కలిపినట్లు కంపెనీ తెలిపింది.
ఫైర్‌ఫాక్స్, ట్రెక్ బ్రాండ్‌ల క్రింద కంపెనీ సుమారు 70 బైస్కిళ్లను విక్రయిస్తోంది. వీటన్నింటినీ దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లలో విక్రయించడం జరుగుతోంది. ఫైర్‌ఫాక్స్‌కు శ్రీలంకలో ఉత్పత్తి కేంద్రం ఉంది. అక్కడ తయారైన ఉత్పత్తులను ఇండియాకు దిగుమతి చేసుకుంటుంది. ట్రెక్ బ్రాండ్ సైకిళ్లను మాత్రం అమెరికా, చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. దేశీయ విపణిలో ఫైర్‌ఫాక్స్ బ్రాండ్ సైకిళ్లు రూ.4,000 నుంచి 18,000 రేంజ్‌లో ఉండగా, ట్రెక్ బ్రాండ్ సైకిళ్లు రూ.20,000 నుంచి 85,000 రేంజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








