వైపర్ హెల్మెట్‌తో వర్షాకాలంలో కూడా జాలీ రైడే..!
సాధారణంగా వర్షాకాలంలో ద్విచక్ర వాహనం రైడ్ చేయటం కొంచెం కష్టంతో కూడుకున్నదే. అందులోనూ వర్షం పడుతున్నప్పుడు రైడ్ చేయాలంటే మరీ ఇబ్బంది. వర్షానికి తోడు హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయాలంటే.. ఇక అంతే సంగతులు..! జోరుగా వర్షం వస్తున్నప్పుడు వర్షపు నీటి బిందువులు హెల్మెట్ విండ్‌షీల్డ్ (హెల్మెట్ ముందువైపు ఉండే అద్దంలా ఉండే ఫైబర్ గ్లాస్)పై పడి మన దృష్టిని మందగించేలా చేస్తాయి. దీనివలన అనుకోని ప్రమాదాలు సైతం జరిగే ఆస్కారం ఉంది.
మరి ఈ సమస్యను పరిష్కరించడం ఎలా..? ఈ ఆలోచనే ఓ హెల్మెట్ కంపెనీకు వచ్చింది. అంతే, వెంటనే ఇదిగో ఇలా హెల్మెట్‌కు వైపర్‌ను అమర్చి అందరి దృష్టినీ ఆకర్షించేంది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ హెల్మెట్ తయారీ కంపెనీ వర్షాకాలం, శీతాకాల్లో హెల్మెట్ ధరించి రైడ్ చేసే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దానికి వైపర్‌ను అమర్చి డిజైన్ చేసింది. మంచు ఎక్కువగా ఉండే దేశాల్లో హెల్మెట్ ధరించి బైక్ రైడ్ చేయటమంటే ప్రాణాలను గాలిలో పెట్టడటమే.
సాధారణ హెల్మెట్‌లను ధరించి రైడ్ చేస్తే, హెల్మెట్ విండ్‌షీల్డ్ మంచు/నీరు చేరుకుంటుంది. ఇలా చేరిన తేమ/తడిని చేతులకు ఉన్న హ్యాండ్ గ్లౌజ్‌ల ద్వారా శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. అందుకే ఈ వైపర్‌తో కూడిన హెల్మెట్‌లను అభివృద్ధి చేయటం జరిగింది. కార్లకు ఉండే వైపర్ల మాదిరిగానే ఇవి పనిచేస్తాయి. హెల్మెట్ విండ్‌షీల్డ్‌పై చేరిన తేమను ఈ వైపర్ శుభ్రం చేసి రోడ్డు స్పష్టంగా కనిపించడానికి దోహదపడుతుంది.
హెల్మెట్‌లో ఉండే ఓ ప్రత్యేకమైన బ్యాటరీ వ్యవస్థ ఆధారంగా ఈ వైపర్ పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు. హెల్మెట్‌లో ఉండే ఓ చిన్ స్విచ్‌ను నొక్కటం ద్వారా వైపర్‌ను ఆన్ చేసుకోవచ్చు. బాగుంది కదూ ఈ వైపర్ హెల్మెట్.. ఇలాంటివి మన ఇండియన్ మార్కెట్లో కూడా దొరికితే మరింత బావుంటుంది. మీరేమంటారు...?


Click it and Unblock the Notifications








