స్వంత టెక్నాలజీతో రానున్న హీరో మొట్టమొదటి బైక్
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) తమ జపాన్ భాగస్వామి హోండా నుంచి విడిపోయి ఏడాది కాలం గడిచిపోయినప్పటికీ, ఇంకా హోండా నుంచి పొందిన టెక్నాలజీతోనే దేశీయ విపణిలో ఉత్పత్తులను అందిస్తోంది. ఈమేరకు ఇరు సంస్థలు విడిపోయే సమయంలో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త లైసెన్స్ ఒప్పందంలో భాగంగా, హీరో మోటోకార్ప్ 2014 సంవత్సరం వరకూ హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చు.
అయితే, అంతకంటే ముందుగానే తమ స్వంత టెక్నాలజీతో తయారు చేసిన మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని హీరో మోటోకార్ప్ యోచిస్తోంది. తమ స్వంత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి ద్విచక్ర వాహనాన్ని 2013-14లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వస్తామని, 2014-15లో మరిన్ని స్వంత టూవీలర్లను అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా తమ ఉత్పత్తులను విడుదల చేస్తామని హీరో మోటోకార్ప్ తెలిపింది.

తమకు ఈబిఆర్, ఏవిఎల్, ఇంజన్స్ ఇంజనీరింగ్ వంటి సాంకేతి భాగస్వాములు ఉన్నారని, ఇప్పటికే వీరితో కలిసి పనిచేయటం ప్రారంభించామని, 2013-14 నాటికి తమ తొలి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు. తర్వాతి తరం ఉత్పత్తులను (నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్)ను తీసుకువచ్చేందుకు గడచిన నెలలో ఇటీలీకి చెందిన టూవీలర్ డిజైన్ సంస్థ ఇంజన్స్ ఇంజనీరింగ్‌తో హీరో మోటోకార్ప్ చేతులు కలిపింది.
అంతకు క్రితం, హై-ఎండ్ బైక్ సెగ్మెంట్లో మరింత స్థిరత్వాన్ని సంపాధించుకునేందుకు అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్)తోనూ, అనంతరం ఆస్ట్రియాకు చెందిన ఇంజన్ డెవలపర్ ఏవిఎల్‌తోనూ హీరో మోటోకార్ప్ ఒప్పందాలను కుదుర్చుకుంది. గ్లోబల్ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు గానూ, వాటిని అక్కడి మార్కెట్ పరిస్థితులకు తగిన విధంగా కస్టమైజ్ చేయనున్నామని దువా చెప్పారు. ఐదేళ్లలో మొత్తం వాహన విక్రయాల్లో 10 శాతం ఎగుమతులు తమ లక్ష్యమని, మార్కెట్ సెంటిమెంట్ బలంగా లేని కారణంగా, మందకొడిగా సాగుతున్న అమ్మకాలు ఈ పండుగ సీజన్‌లో పుంజుకున్నప్పటికీ, రెండంకెల వృద్ధికి చేరుకోవటం కష్టమేనని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








