ఇంపల్స్, మ్యాస్ట్రో, ఇగ్నైటర్ మోడళ్ల ఉత్పత్తి బంద్!!
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఇంపల్స్, ఇగ్నైటర్ మోటార్‌సైకిళ్లను మరియు మ్యాస్ట్రో స్కూటర్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుంది. ఈ మూడు ఉత్పత్తులు కొత్తవే అయినప్పటికీ, ఇందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం జపాన్ భాగస్వామి హోండా నుంచి పొందినది కావటం వల్ల ఈ మోడళ్లను తొలిగిస్తామని కంపెనీ పేర్కొంది.
కాగా.. హీరో మోటోకార్ప్ యూరప్‌కు చెందిన ఓ డిజైన్ అండ్ టెక్నాలజీ భాగస్వామితో తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, హోండా టెక్నాలజీ వస్తున్న మోడళ్లన్నింటినీ రీప్లేస్ చేయాలని యోచిస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఉత్పత్తులను కొత్త భాగస్వాముల సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఉత్పత్తులతో భర్తీ చేస్తామని కంపెనీ ఎమ్‌డి పవన్ ముంజాల్ తెలిపారు.
వాస్తవానికి ఈ మూడు మోడళ్లలో కూడా కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, డిజైన్ పరంగా కూడా ఇవి హోండా వాహనాలను పోలి ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లలో హోండా అందిస్తున్న 'హోండా ఎన్ఎక్స్ఆర్ 150' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో ఇంపల్స్ 150 మోటార్‌సైకిల్‌ను తయారు చేయటం జరిగింది. అలాగే హోండా స్టన్నర్ 125సీసీ బైక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్‌ను హోండా ఏవియేటర్ స్కూటర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో మ్యాస్ట్రో స్కూటర్లను కంపెనీ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ మూడు మోడళ్లలో జపనీస్ హోండా డిఎన్‌ఏను స్పష్టంగా గమనించవచ్చు.
గడచిన సంవత్సరం హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి హోండా విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హీరో సాంకేతిక భాగస్వామి కోసం శోధిస్తోంది. కంపెనీ ఇటీవలే ఎరిక్ బ్యూయెల్‌తో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఏదేమైనప్పటికీ.. హీరో, హోండా కంపెనీల మధ్య కుదిరిన లైసెన్స్ ఒప్పందం ప్రకారం, 2012 వరకూ హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని హీరో ఉపయోగించుకోవచ్చు.
కాగా.. హీరో హోండా కంపెనీ హీరో మోటోకార్ప్‌గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో హీరో ఇంపల్స్ దేశీయ విపణిలో విడుదలైంది. ఇటు ఆన్-రోడ్, అటు ఆఫ్-రోడ్ ప్రయోజనార్థం రూపొందించిన హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌లో 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
అలాగే, గడచిన ఏప్రిల్ నెలలో హీరో మాస్ట్రో స్కూటర్‌ను కంపెనీ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 109సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఓహెచ్‌సి ఇంజన్ ఉపయోగించారు. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.10 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 60 కి.మీ. మైలేజీనిస్తుంది.
కాగా.. గడచిన ఆగస్ట్ నెలలో హీరో ఇగ్నైటర్ మోటార్‌సైకిల్‌ను హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఇందులో ఉపయోగించిన 124.77సీసీ ఏటిఎఫ్‌టి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది


Click it and Unblock the Notifications








