హోండా బ్రాండ్‌ను పూర్తిగా తొలగిస్తాం: హీరో మోటోకార్ప్
ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ (అమ్మకాల పరంగా) హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) అందిస్తున్న అన్ని ద్విచక్ర వాహనాలపై, ఇక నుంచి హోండా లోగో పూర్తిగా కనుమరుగు కానుంది. గడచిన సంవత్సరంలో జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయిన తర్వాత, హీరో గ్రూప్ భారత మార్కెట్లో ఒంటరి ప్రయాణం చేసేందుకు సిద్ధమై ఓ బ్రాండ్ లోగోను డిజైన్ చేసిన, లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ఈ రెండు సంస్థల మద్య పెట్టుబడుల ఉపసంహరణ జరిగినప్పటికీ, ఒప్పందం ప్రకారం మరో రెండేళ్ల పాటు హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని హీరో మోటోకార్ప్ ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ నెల నుంచే తమ వాహనాలన్నింటిపైనా పూర్తిగా హీరో బ్రాండ్ మాత్రమే ఉంటుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సిడు డాన్, సిడి డీలక్స్‌లపైనే హీరో హోండా ట్యాగ్ ఉందని ఆయన వివరించారు.

ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కు, హోండాకు మధ్య కుదిరిన కొత్త లైసెన్స్ ఒప్పందం ప్రకారం, 2014 వరకూ హీరో మోటోకార్ప్ 'హీరో హోండా' బ్రాండ్ (లోగో)ను తమ వాహనాలపై ఉపయోగించుకోవచ్చు. అయితే, అంతకన్నా ముందుగానే హోండా పేరును తొలగించే ప్రక్రియను హీరో చేపట్టింది. వీలైనంత త్వరగా స్వంత బ్రాండ్‌తో, స్వంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
ఇందులో భాగంగానే, హోండా టెక్నాలజీతో రూపొందించి, తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఇంపల్స్, ఇగ్నైటర్ మోటార్‌సైకిళ్లను మరియు మ్యాస్ట్రో స్కూటర్‌ల ఉత్పత్తిని కూడా నిలిపి వేయాలని హీరో భావిస్తోంది. వాస్తవానికి ఈ మూడు మోడళ్లలో కూడా కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, డిజైన్ పరంగా కూడా ఇవి హోండా వాహనాలను పోలి ఉంటాయి.
గ్లోబల్ మార్కెట్లలో హోండా అందిస్తున్న 'హోండా ఎన్ఎక్స్ఆర్ 150' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో ఇంపల్స్ 150 మోటార్‌సైకిల్‌ను తయారు చేయటం జరిగింది. అలాగే హోండా స్టన్నర్ 125సీసీ బైక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్‌ను హోండా ఏవియేటర్ స్కూటర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో మ్యాస్ట్రో స్కూటర్లను కంపెనీ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ మూడు మోడళ్లలో జపనీస్ హోండా డిఎన్‌ఏను స్పష్టంగా గమనించవచ్చు.


Click it and Unblock the Notifications








