పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవు క్యూ కట్టిన ప్రజలు
మరికొద్ది గంటల్లో పెట్రోల్ ధర భగ్గుమనబోతుందని తెలియగానే.. బుధవారం రాత్రి వాహన చోదకులంతా ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై పడ్డారు. స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజునే చూడాలనే ఆత్రంతో టికెట్ల కోసం ఎగబడ్డట్లుగా.. మోటార్‌సైకిళ్లు, కార్లు పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల పొడవున క్యూ కట్టాయి. దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని పెట్రోల్ బంకులైతే పెట్రోల్ ధర పెంపు వార్త కొంత సమయానికే నో స్టాక్ బోర్డు పెట్టేసి పెట్రోల్ బంకులను మూసేశాయి.
బుధవారం అర్థరాత్రి నుండి పెట్రోల్ ధరలను ప్రతి లీటరుపై రూ.7.50 పైసలు చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనం పెట్రోల్‌ను తమ వాహనాల ట్యాంకుల్లో నింపుకోవాలని వాహన చోదకులు పెట్రోల్ బంకుల వైపు పరుగులు పెట్టారు. వాస్తవానికి, ఈ విధంగా మన ఆదా చేసుకునేది చాలా స్వల్ప మొత్తమే. ఎలాగైనా మరుసటి రోజు నుండి అధిక ధర వెచ్చించి పెట్రోల్‌ను కొనుగోలు చేయాల్సిందేనన్న విషయాన్ని గుర్తుంచుకుంటే సమయం ఆదా అవుతుంది.
పెట్రోల్ ఫిల్ చేసుకోవటం గంటలు గంటలు క్యూలో నిలబడి విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం అనవసరం. ఉదాహరణకు.. ఒక ద్విచక్ర వాహనాన్ని తీసుకుంటే, అందులో సుమారు 5-10 లీటర్ల పెట్రోల్‌ను మాత్రమే నింపుకోగలం. దీనిపై మహా అయితే రూ.35-75 లను మాత్రమే మనం ఆదా చేసుకోగలం. అలాగని, ఇలా పూర్తిగా ట్యాంక్‌ను ఫిల్ చేసుకోవటం ద్వారా మనం ఓ పూర్తి నెల పాటు ప్రయాణిస్తామా అంటే అది లేదు. ట్యాంక్‌లో పెట్రోల్ ఖాలీ అయిన తర్వాత మళ్లీ అధిక ధర వెచ్చించి పెట్రోల్‌ను కొనుగోలు చేయాల్సింది.
ఈ చిన్న విషయాన్ని గ్రహించ లేక కొందరు తమ పనులు మానుకొని మరీ పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాయటం, పెట్రోల్ కోసం బంకు సిబ్బంది, ఇతరులతో గొడవలకు దిగటం వంటివి మనం తరచూ గమనిస్తూనే ఉంటాం. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ గతంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా క్షీణించడంతో, అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతి చేసుకునే ముడి చమురు ధర కూడా పెరిగిపోయింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా పెట్రో వడ్డన చేయాల్సి వచ్చింది. ఇక పెట్రోల్ ధరలు దిగివస్తాయనే ఊహ మాత్రం తామరాకుపై నీటి బుడగ లాంటిదే.


Click it and Unblock the Notifications








