కర్ణాటక మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్
ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో దశల వారీగా విడుదల చేస్తూ వస్తున్న కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ (నేక్‌డ్ స్పోర్ట్స్) స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు కర్ణాటక మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను బజాజ్ ఆటో తొలిసారిగా పూణే మార్కెట్లో, అనంతరం ఢిల్లీ మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోని బజాజ్ ఆటో డీలర్లు కొత్త పల్సర్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.
కర్ణాటక మార్కెట్లో కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బైక్ ధర రూ. 85,863 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కర్ణాటక తర్వాత మరిన్ని ఇతర మార్కెట్లలో బజాజ్ ఆటో తమ కొత్త బైక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త పల్సర్‌తో పాటుగానే సరికొత్త అప్‌గ్రేడెడ్ బజాజ్ డిస్కవర్ 125ఎస్‌టి బైక్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ విషయానికి వస్తే, ప్రపంచంలో మరెక్కడాని లేని విధంగా తొలిసారిగా ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీతో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, 4-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి 199.5సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9500 ఆర్‌పిఎమ్ వద్ద 23.52 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.3 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
Bajaj Pulsar 200NS Photo Gallery:
బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. కొత్త పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైక్ కేవలం 3.8 సెకండ్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని, అలాగే 9.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. పల్సర్ 200ఎన్ఎస్ గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇంతటి శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ లీటర్ పెట్రోల్‌కు 58 కి.మీ (గంటకు 55 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు మాత్రమే) మైలేజీని కూడా ఇస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది.


Click it and Unblock the Notifications









