సరికొత్త థండర్‌బర్డ్ 500ను విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ఐషర్ గ్రూపుకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బుల్లెట్ బైక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త సెకండ్ జనరేషన్ థండర్‌బర్డ్ మార్కెట్లోకి విడుదలయ్యింది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ రెండు వేరియంట్లలో(500సీసీ, 350సీసీ) లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - రూ.1,82,571
- రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - రూ.1,43,346
(అన్ని ధరలు ఆన్-రోడ్, ముంబై)
ఈ సందర్భంగా, ఐషర్ మోటార్స్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ కంపెనీ కనబరుస్తున్న అమ్మకాల జోరును గమనిస్తుంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల అమ్మకాల మ్యాజిక్ సంఖ్యను అధిగమించగలమని, అమ్మకాల్లో దాదాపు 50 శాతం వృద్ధిని సాధించామని ఆయన చెప్పారు. కాగా.. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు మోడల్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉంది. బైకర్ల కోసం లెథర్ జాకెట్లు, నైలాజ్ జాకెట్లు, హెల్మట్లు, గ్లౌజ్‌లు, గ్యాడ్జెట్లు వంటి యాక్ససరీలను కూడా అందిస్తున్నామని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో రెండవ ప్లాంటును ప్రారంభంలోకి తీసుకురాగలమని అంచనా వేస్తున్నామని, ఈ ప్లాంటు నిర్వహణలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం తమ మోడళ్లకు ఉన్న దీర్ఘకాల వెయింటిగ్ పీరియడ్ తగ్గుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం అమ్మకాల్లో సుమారు 90 శాతం అమ్మకాలు దేశీయ మార్కెట్ నుంచే వస్తున్నాయని, ఉత్పత్తి సామర్థ్యం కొరత కారణంగా డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయలేకపోతున్నామని సిద్ధార్థ్ లాల్ వివరించారు. గ్లోబల్ బ్రాండ్‌గా మారాలని తాము కోరుకుంటున్నప్పటికీ, ప్రధమ ప్రధాన్యత మాత్రం భారత మార్కెట్‌కే ఇస్తామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కంపెనీ ఏటా 1,000 యూనిట్ల 350సీసీ థండర్‌బర్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకి పధ్మనాభన్ తెలిపారు. కాగా.. కొత్త థండర్‌బర్డ్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసిన కొద్ది గంటల్లో 100 బుకింగ్‌లో వచ్చాయని అందులో 50 కేవలం ముంబై నుంచి మాత్రమే వచ్చాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షాజీ కోషి చెప్పారు. మొట్టమొదటి థండర్‌బర్డ్ 350సీసీ వేరియంట్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ 2002 సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేసింది.


Click it and Unblock the Notifications









