డీజిల్ బైక్ తయారు చేయటం లేదు: రాయల్ ఎన్‌ఫీల్డ్
పెట్రోల్ ధరలు భగ్గమంటున్న నేపథ్యంలో, మోటార్‌సైకిల్ ప్రియులు తక్కువ ధర కలిగిన డీజిల్ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్లను కోరుకుంటున్నారు. ఒకప్పుడు డీజిల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లను అందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆ తర్వాత వాటిని చరిత్రలో కలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ వీటిని తిరిగి మార్కెట్లో పునఃప్రవేశ పెట్టవచ్చని గతంలో పుకార్లు వచ్చాయి. దీంతో మళ్లీ బైకర్లలో ఓ తెలియని ఆసక్తి నెలకొంది. కానీ.. అస్సలు డీజిల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లను తయారు చేయాలన్న ఆలోచనే తమకు లేదని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖరాఖండిగా చెప్పేసింది.
ఐషర్ గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ టూవీలర్ కంపెనీ, ప్రముఖ లీజర్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త థండర్‌బర్డ్ 500, థండర్‌బర్డ్ 350 లను తాజాగా బెంగుళూరు మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంపెనీ సీఈఓ డా. వెంకీ పద్మనాభన్ డ్రైవ్‌స్పార్క్‌తో మాట్లుడుతూ.. భవిష్యత్తులో డీజిల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లను తయారు చేయబోమని, గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కెఫే రేసర్ మోటార్‌సైకిల్ అతి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

తమ వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో వాటినే రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తుందని పద్మనాభ్ వివరించారు. అయితే, తక్కువ సీసీ ఇంజన్ కలిగిన మోటార్‌సైకిళ్లను కానీ లేదా లక్ష రూపాయల కన్నా దిగువన కానీ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టే యోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో అందిస్తున్న మోడళ్లకు ఉత్పత్తి సామర్థ్యానికి మించి డిమాండ్ ఉంది. అందుకే వీటిని సొంతం చేసుకోవాలనుకునే వారు మూడు నెలల నుంచి ఆరు నెలలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి బదులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొని ప్రస్తుతం తమ మోటార్‌సైకిళ్లకు అధికంగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించుకోవాలని యోచిస్తోంది. మనదేశంలో అత్యల్పంగా మోటార్‌సైకిళ్లను తయారు చేసే కంపెనీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డే. ప్రస్తుతం కంపెనీ ఏటా 75,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు చెన్నైలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఏడాదిలో ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది.
Image Source: enfieldmania


Click it and Unblock the Notifications








