తమిళనాడు మార్కెట్లోకి హయాటే, ఉత్పత్తి వేగవంతం
జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త 110సీసీ బైక్ 'సుజుకి హయాటే'ను కంపెనీ తాజాగా తమిళనాడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో ఏటా 4.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతుంటాయని, ఈ విభాగంలో అవకాశాలు అధికంగా ఉన్న కారణంగా తక్కువ ధరకే ఓ మంచి మోటార్‌సైకిల్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో సుజుకి హయాటే 110సీసీ బైక్‌ను అభివృద్ధి చేశామని కంపెనీ నేషనల్ హెడ్ (సేల్స్) ఆనంద్ థాకూర్ తెలిపారు.
కంపెనీ మొత్తం అమ్మకాలలో తమిళనాడు రాష్ట్రం 10 శాతం వాటాను కలిగి ఉందని, ఒక్క దక్షిణాధి ప్రాంతాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇది 30 శాతం ఉంటుందని ఆయన తెలిపారు. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను అందించేందుకు గానూ, ప్రస్తుతం సాలీనా 3.6 లక్షల యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 4.5 లక్షల యూనిట్లకు పెంచనున్నామని, దీనిని 2013-14 నాటికి ఐదు లక్షల యూనిట్లకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు.
తమిళనాడు మార్కెట్లో సుజుకి హయాటే కిక్ స్టార్ట్ మోడల్ ధర రూ.41,356 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.43,356 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. సుజుకి హయాటే విషయానికి వస్తే.. స్టయిలిష్ లుక్, అట్రాక్టివ్ బాడీ గ్రాఫిక్స్, పవర్‌ఫుల్ 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్, 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రింది వైపుకు), 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లతో ఇది లభిస్తుంది.
సుజుకి హయాటే మొత్తం బరువు 112 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు, మైలేజ్ 70 కి.మీ. ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ (షాషీ)కు ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెషన్, వెనుక వైపు 5-వే అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు. సుజుకి హయాటే మోటార్‌సైకిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను కంపెనీ నియమించుకుంది.


Click it and Unblock the Notifications









