హయాటే 110సీసీ బైక్‌ను విడుదల చేసిన సుజుకి
జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్స్ ఇండియా గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన 110సీసీ బడ్జెట్ బైక్ "సుజుకి హయాటే"ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఈ మోడల్‌ను సైలెంట్‌గా మార్కెట్లోకి దించేసింది. ఇది చూడటానికి దాదాపుగా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 125సీసీ బైక్ స్లింగ్‌షాట్ మాదిరిగానే ఉంటుంది.
ఆకర్షనీయమైన గ్రాఫిక్స్, 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్, 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రింది వైపుకు), 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఆప్షన్లతో సుజుకి హయాటే లభిస్తుంది. దీని మొత్తం బరువు 112 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ (షాషీ)కు ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెషన్, వెనుక వైపు 5-వే అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు.
గ్రామీణ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని చవక ధరకే ఓ మంచి స్టయిలిష్ మోటార్‌సైకిల్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో సుజుకి హయాటే 110సీసీ బైక్‌ను సుజుకి మోటార్‌సైకిల్స్ అభివృద్ధి చేసింది. సుజుకి హయాటే వైట్, గ్రీన్, గ్రే, రెడ్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.40,162 నుండి రూ.42,162 రేంజ్‌లో ఉండనుంది.
'హయాటే' అనేది జపాన్ పదం, జపనీస్ భాషలో దీని అర్థం "తాజా గాలి" లేదా "వేగమైన గాలి" అని అర్థం. సుజుకి హయాటే బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ కొత్త బైక్ ప్రచారం కోసం సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.


Click it and Unblock the Notifications









