చైనా నుంచి ఆటో విడిభాగాలను కొనుగోలు చేయనున్న టాటా
ఇకపై టాటా కార్లలో చైనా స్పేర్ పార్ట్‌లు దర్శనమివ్వనున్నాయి. దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ చైనా నుంచి ఆటోమొబైల్ విడిభాగాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటానే వెల్లడించారు. ఇండియన్ మార్కెట్లో లభ్యం కాని కొన్ని రకాల విడిభాగాలను పొరుగు దేశమైన చైనా నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.
టాటా మోటార్స్ అందిస్తున్న కార్లలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన గేర్ బాక్స్‌లను పరిచయం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా, వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారును సృష్టించిన టాటా మోటార్స్, ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న కార్లలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులో లేదు.
అయితే, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ కంపెనీలు మాత్రం చిన్న కార్లలో సైతం ఆటోమేటిక్ వేరియంట్‌ను అందిస్తున్నాయి. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లకు క్రేజ్ క్రమంగా పెరుగుతున్న తరుణంలో తాము కూడా ఆటోమేటిక్ కార్లను విడుదల చేస్తే బావుంటుందని టాటా మోటార్స్ నిర్ణయించింది. మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లను తమ మాతృ సంస్థల ద్వారా పొందుతుండగా, టాటా మోటార్స్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది.
వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చవక ధరకే ఉత్పత్తులను అందించే చైనాపై టాటా మోటార్స్ కన్నేసింది. చైనా దేశం నుంచి అయితే తక్కువ ధరకే ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లను దిగుమతి చేసుకోవాలని టాటా యోచిస్తోంది. వాస్తవానికి చైనా ఉత్పత్తులు మంచి నాణ్యతను కలిగి ఉండవనేది చాలా మంది విశ్వాసం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చైనా విడిభాగాలు ఉపయోగించి తయారు చేసే టాటా కార్లను కొనుగోలుదారులు ఎంత మేర ఆదరిస్తారో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications









