మహీంద్రా టూవీలర్స్ నుంచి మూడు కొత్త మోటార్‌సైకిళ్లు
గతకొద్ది కాలంగా కనుమరుగైపోయిన మహీంద్రా ద్విచక్ర వాహనం స్టాలియో 110సీసీ గుర్తుందా..? గేర్ బాక్స్ లోపం కారణంగా ఈ మోడల్ ఉత్పత్తి నిలిపివేసిన మహీంద్రా టూవీలర్స్ ఇప్పుడు తాజాగా అప్‌గ్రేడెడ్ ఇంజన్‌తో ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను తిరిగి దీపావళి నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అలాగే, కంపెనీ గతంలో ఆవిష్కరించిన 300సీసీ మోటార్‌సైకిల్ మహీంద్రా మోజో కూడా ఉత్పత్తి దశకు చేరుకోనుంది.
ద్విచక్ర వాహనాల అభివృద్ధి కోసం మహీంద్రా అండ్ మహీంద్రా రూ.100 కోట్లతో పుణేలో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రాన్ని బుధవారం ప్రారంభించింది. ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన సరికొత్త 110సీసీ, 300సీసీ ఇంజన్లను కంపెనీ విడుదల చేసింది. ఇవే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు కొత్త మోడళ్ల మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని కంపెనీ పేర్కొంది.
నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తులను తయారు చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్ర సహకరిస్తుందని మహీంద్రా గ్రూప్ వైస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ ఆర్ అండ్ డి కేంద్రంలో 175 మంది ఇంజనీర్లు, డిజైనర్లు పని చేస్తారని ఆయన చెప్పారు. కొత్తగా తాము మార్కెట్లోకి విడుదల చేయనున్న మోటార్‌సైకిళ్ల గురించిన సాంకేతిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
కాగా.. మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న రోడియో స్కూటర్‌లో ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో దీని ధర రూ.49,575 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పాత మహీంద్రా రోడియో స్కూటర్‌తో పోల్చుకుంటే ఎన్నో మెరుగ్గా ఉండే ఈ సరికొత్త రోడియో ఆర్‌జెడ్‌ను తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. అధునాతన 125సీసీ జెడ్ సిరీస్ ఇంజన్‌తో రూపొందించిన మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ మంచి పికప్‌ను మాత్రమే కలిగి ఉండటమే కాకుండా, మంచి మైలేజ్‌ను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ఇంజన్‌లో అప్‌డేటెడ్ డ్యూయల్-కర్వ్ డిజిటల్ ఇగ్నిషన్ సిస్టమ్ (డిసిడిఐ)ను ఉపయోగించిన కారణంగా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటర్ పెట్రోల్‌కు 59.38 కి.మీ. మైలేజీనిస్తుందని మహీంద్రా వెల్లడించింది. రోడియో ఆర్‌జెడ్ కూడా 125సీసీ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో అమర్చిన 124.6సీసీ ఫోర్-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 0.91 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్స్)తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications









