ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన టీవీఎస్
చెన్నై కేంద్రగా పనిచేస్తున్న ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ అభివృద్ధి చేసిన 125సీసీ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ 'ఫినిక్స్'ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త బైక్ ధర రూ.53,000 (ఎక్స్ షోరూమ్, చెన్నై)గా నిర్ణయించామని, తొలుత ఈ బైక్‌ను చెన్నై మార్కెట్లో విడుదల చేస్తున్నామని, త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది.
ప్రీమియం బైక్‌ల్లో ఉండే ఫీచర్లు, శక్తిమంతమైన ఈకోథ్రస్ట్ ఇంజిన్‌తో టీవీఎస్ ఫినిక్స్‌ను రూపొందించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) హెచ్.ఎస్. గోయింది తెలిపారు. టీవీఎస్ ఫినిక్స్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభించే ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
టీవీఎస్ ఫినిక్స్ ఐదు ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభ్యమవుతుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి స్ఫూర్తి పొందిన డెకాల్స్ (బాడీ ప్యానెల్స్), రోటోపెటల్ డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్, ఆల్-బ్లాక్ ఇంజన్, అల్లాయ్ వీల్స్, స్టిచ్డ్ డ్యూయెల్ టెక్స్చర్, హై డెన్సిటీ కంఫర్ట్ కుషన్ సీట్ వంటి ఫీచర్లు టీవీఎస్ ఫినిక్స్ 125 సొంతం.
గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ మోటార్ కంపెనీ తొలిసారిగా ఫినిక్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఫినిక్స్ 125సీసీ సగ్మెంట్లో టీవీఎస్ అందిస్తున్న రెండవ ఉత్పత్తి కావటం విశేషం (మొదటి ఉత్పత్తి టీవీఎస్ ఫ్లేమ్). ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లకు ధీటుగా టీవీఎస్ ఫినిక్స్ నిలువనుంది.


Click it and Unblock the Notifications









