పండుగ సీజన్‌లో మార్కెట్లోకి రానున్న టీవీఎస్ ఫినిక్స్

'ఫినిక్స్' గురించి తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా... ఇప్పుడు ఇదే విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరిచింది. ఈ పండుగ సీజన్‌లోనే 125 సీసీ మోటార్‌సైకిల్ ఫినిక్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు.
రానున్న 15 నెలల్లో మరిన్ని సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ద్విచక్ర వాహన మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటామని టీవీఎస్ 20వ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లను సవాల్ చేయనుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో హోండా షైన్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త టీవీఎస్ ఫినిఎక్స్ 125 ఈ పోటీని ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సి ఉంది. గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ మోటార్ కంపెనీ తొలిసారిగా ఫినిక్స్‌ను ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం టీవీఎస్‌కు 125సీసీ బైక్ సెగ్మెంట్లో సరైన ఉత్పత్తి లేదు. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ ఈ సెగ్మెంట్లో 'ఫ్లేమ్'కు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది.
టీవీఎస్ ఫినిక్స్ ధర టీవీఎస్ ఫ్లేమ్ ధర కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. టీవీఎస్ ఫ్లేమ్ ధరలు రూ.46,000 నుంచి రూ.48,000 రేంజ్‌లో ఉన్నాయి. ఈ 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10.5 బిహెచ్‌పిల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. టీవీఎస్ నుంచి పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్, బడ్జెట్‌తో కూడిన బైక్‌ను కోరుకునే వారికి టీవీఎస్ ఫినిక్స్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలువనుంది.


Click it and Unblock the Notifications








