అగ్రస్థానంపై కన్ను: టీవీఎస్ నుంచి మరిన్ని మోడళ్లు
ప్రస్తుతం భారత్‌లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నప్పటికీ, బైక్‌ల అమ్మకాలు ఏ మాత్రం తగ్గటం లేదు సరికదా నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ బైక్ సెగ్మెంట్ (100-110సీసీ), స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్ (150సీసీకు మించి)లలో మంచి ప్రోత్సాహకర వృద్ధిని కనబడుతోంది. ఇందుకు ప్రధాన కారణం, మార్కెట్లో ఉన్న టూవీలర్ కంపెనీలు సరసమైన ధరలకే కొత్త మోడళ్లను కొనుగోలుదారులకు పరిచయం చేస్తుండటమే.
టూవీలర్ మార్కెట్లో అగ్రస్థానం పైనే అన్ని కంపెనీల దృష్టి నెలకొని ఉంది. అందుకే ఒక కంపెనీకు మించి మరొక కంపెనీ కొత్త ఉత్పత్తులతో, సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం టీవీస్ మోటార్ కంపెనీ కూడా అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. టూవీలర్ మార్కెట్లో అగ్రగాములుగా ఉన్న హోండా, బజాజ్‌లను బీట్ చేసేందుకు టీవీఎస్ కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది.
ఇందుకోసం టీవీఎస్ రూ.300-400 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రధానం కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయటానికి, ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయటానికి ఉపయోగించనుంది. 200-250సీసీ సెగ్మెంట్లో పెద్ద బైక్‌లతో పాటుగా (బహుశా పెద్ద అపాచీ అయిండోచ్చు) ఆరు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టాలని టీవీఎస్ యోచిస్తోంది. ఇవన్నీ కూడా 2014-15 లోపుగా ఇండియన్ రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.
ఈ విషయం గురించి టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ ఎమ్‌పిఐ, వినయ్ హార్నే మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము 180సీసీ వరకూ, దానికి దిగువన మాత్రమే ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, త్వరలోనే పెద్ద బైక్ సెగ్మెంట్లోకి ప్రవేశించున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెద్ద బైక్‌ల ట్రెండ్ నడుస్తోందని, వీటి అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధి మాత్రం అత్యధికంగా ఉందని ఆయన చెప్పారు. అంటే.. త్వరలోనే పెద్ద పవర్‌ఫుల్ టీవీఎస్ అపాచీలను మనం చూడబోతున్నం అన్నమాట.
చిన్న ఇంజన్లు 20 శాతం తక్కువ కర్బన వ్యర్థాలను విడుదల చేస్తాయి, అంతేకాకుండా ఇవి మెరుగైన మైలేజీని కూడా అందిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లకు సైతం సరిపోయే విధంగా యూరో-4 కాలుష్య నిబంధనలను పాటించే విధంగా పెద్ద ఇంజన్లను టీవీఎస్ అభివృద్ధి చేస్తోంది. ఇందు కోసం అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఇంజన్ టెక్నాలజీ కంపెనీలు ఏవీఎల్, రికార్డలతో కలిసి టీవీఎస్ పనిచేస్తోంది. గత మూడేళ్లుగా టీవీఎస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ టెక్నాలజీ (బైక్‌ల కోసం), హైబ్రిడ్ టెక్నాలజీలపై టీవీఎస్ ప్రధానంగా దృష్టి సారించింది.
గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హైబ్రిడ్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన టీవీఎస్ క్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. రూ.55,000 నుంచి రూ.60,000 రేంజ్‌లో ఈ హైబ్రిడ్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టీవీఎస్ యోచిస్తోంది. మరో 18 నెలల్లో ఈ కొత్త ఉత్పత్తులన్నీ మార్కెట్‌కు చేరనున్నాయి. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ నుంచి రెండు కొత్త మోటార్‌సైకిళ్లు, ఓ స్కూటర్ మార్కెట్లోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications








