ఇండియాలో 'కెఫే'లను ప్రారంభించనున్న వెస్పా
ముచ్చటగా మూడోసారి భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఇటాలియన్ స్కూటర్ వెస్పా, ఇకపై ఇండియాలో కాఫీ, టీలు అమ్మేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఇటాలియన్ కార్ మేకర్ ఫియట్ భారత్‌లో అక్కడక్కడా కాఫీ షాప్‌లను (ఫియట్ కెఫే) ప్రారంభించి, ప్రస్తుతం వాటిని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహా ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా కూడా ఇండియాలో వెస్పా కాఫీ షాప్‌లను (వెస్పా కెఫే) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
తొలి వెస్పా కెఫే మహారాష్ట్రలోని పూనేలో ప్రారంభించనున్నారు. ఫియట్ కెఫే మాదిరిగానే వెస్పా కెఫేలో కూడా వెస్పా స్కూటర్ చరిత్రను తెలిపే ఫోటోలు, పురాతన మోడళ్ల చిత్రాలు, వెస్పా స్కూటర్ టెస్ట్ డ్రైవ్‌లను వెస్పా ఇండియా ఆఫర్ చేసే ఆస్కారం ఉంది. వెస్పా తమ బ్రాండ్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ తరహా ప్రణాళికలకు వ్యూహరచనలు చేస్తుంది. వెస్పా కెఫే ద్వారా కంపెనీ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 125సీసీ వెస్పా ఎల్ఎక్స్ స్కూటర్ అమ్మకాలను పెంచుకోవాలని భావిస్తోంది.
ఇక వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇండియాలో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది (పవర్‌ఫుల్). వెస్పా ఎల్ఎక్స్ 125లో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. 8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ ఎలక్ట్రిక్ / కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది.
ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఇందులో ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే. రాష్ట్ర మార్కెట్లో వెస్పా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.68,814 గానూ, ఆన్-రోడ్ ధర రూ.79,900 గానూ ఉంది. బుకింగ్ చేసుకున్న నెల రోజుల్లోపే డెలివరీ ఇస్తామని డీలర్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








