స్కూటర్ల అసెంబ్లింగ్ కోసం 200 మంది మహిళా వర్కర్లు: యమహా
భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని, జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే' ఉత్పత్తిని మహిళలే చేయనున్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఇదివరకెన్నడూ కనివిని ఎరుగని రీతిలో, స్కూటర్ల ఉత్పత్తి కోసం యమహా ఇండియా ఓ సరికొత్త ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా, యమహా కొత్తగా ప్రారంభించిన స్కూటర్ అసెంబ్లింగ్ యూనిట్‌లో మహిళా ఉద్యోగులు స్కూటర్లను అసెంబ్లింగ్ చేయనున్నారు.
ఇందు కోసం యమహా ఇండియా దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న సర్జాపూర్ ప్లాంటులో ఈ స్కూటర్ అసెంబ్లింగ్ ప్లాంట్ నెలకొని ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా చేపట్టిన ఈ ప్రణాళికలో భాగంగా, కేవలం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, వారికి క్లాస్‌రూమ్‌ను అలాగే ఆన్-జాబ్ శిక్షణను కూడా కల్పించడం జరుగుతుంది. వీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆమోదించబడిన అప్రంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా, 3 ఏళ్ల పాటు పారిశ్రామిక శిక్షణను కూడా పొందుతారు.
అంతేకాకుండా, ప్రతి ఏడాది చివర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) ద్వారా నిర్వహించబడే పరీక్షల్లో కూడా వీరు హాజరవటానికి అర్హత కల్పించబడుతుంది. వీరి శిక్షణ కాలం పూర్తయిన తర్వాత యూపి ప్రభుత్వం ద్వారా ఆమోదించబడిన ఐటిఐ సర్టిఫికెట్‌ను వీరు అందుకుంటారు. ఈ విశిష్ట ప్రణాళిక పట్ల ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. ఇది యమహా చరిత్రలోనే మొట్టమొదటిదని, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా, ప్రత్యేకించి మహిళలతో అసెంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించడం ఇదే ప్రప్రధమమని చెప్పారు. ఇకపై పరిశ్రమలో ఈ ట్రెండ్ మరింత ముందుకు వెళ్లగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దీంతో పాటుగా, మహిళా వినియోగదారుల కోసం కంపెనీ ఓ రైడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా అభివృద్ధి చేసింది. 'యమహా ఫిమేల్ రైడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'గా పిలిచే ఈ కార్యక్రమం త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమం ద్వారా కంపెనీ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రే స్కూటర్‌ను అర్బన్ మహిళా కస్టమర్లకు మరింత చేరువ చేయనుంది. అలాగే, కంపెనీ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవటం, మహిళా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కస్టమర్ కాంటాక్ట్ పాయింట్లలో మరింత మంది మహిళా ఉద్యోగులు కూడా నియమించుకోవటం చేస్తోంది.
యమహా రే స్కూటర్ గురించి:
సరికొత్త డిజైన్, స్టయిలిష్ లుక్, మెరుగైన పెర్ఫామెన్స్, ఆకట్టుకునే మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని యమహా ఇండియా అభివృద్ధి చేసిన తమ తొలి స్కూటర్ 'యమహా రే'లో 113సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7 హెచ్‌పిల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది. భారత మార్కెట్లో యమహా రే స్కూటర్ ధర కేవలం రూ.46,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉంది. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications









