యమహా రే స్కూటర్ కోసం డోర్ టు డోర్ క్యాంపైన్
జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చిన మొట్టమొదటి స్కూటర్ యమహా రే కోసం కంపెనీ ఓ విశిష్టమైన క్యాంపైన్‌ను ప్రారంభించింది. పండుగ సీజన్‌లో యువతుల దృష్టిని ఆకట్టుకునేందుకు గాను 9 రోజుల పాటు యమహా ఓ ప్రమోషన్ క్యాంపైన్‌ను నిర్వహించనుంది. కంపెనీ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జూన్ నకటా, నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్‌లు ఈ క్యాంపైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ క్యాంపైన్‌లో భాగంగా ఆరుగురు అందమైన అమ్మాయిలు 6 యమహా రే స్కూటర్లపై న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సంచరించనున్నారు. మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలు వంటి కీలకమైన ప్రాంతాల్లో ఈ స్కూటర్లతో ప్రమోషన్ నిర్వహించనున్నారు. 'లైఫ్ ఈజ్ యాన్ అడ్వెంచర్' అనే స్లోగన్‌తో ఈ క్యాంపైన్ 9 రోజుల పాటు సాగనుంది. ఈ క్యాంపైన్‌ను ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే నిర్వహించనున్నారు. గతంలో యమహా రే స్కూటర్‌ను ఉత్పత్తి చేయటం కోసం కంపెనీ 200 మంది మహిళా ఉద్యోగులని విధుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

యమహా రే స్కూటర్ విషయానికి వస్తే.. సరికొత్త డిజైన్, స్టయిలిష్ లుక్, మెరుగైన పెర్ఫామెన్స్, ఆకట్టుకునే మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని యమహా ఇండియా ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో శక్తివంతమైన 113సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7 హెచ్‌పిల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది. భారత మార్కెట్లో యమహా రే స్కూటర్ ధర కేవలం రూ.46,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉంది. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








