బజాజ్ అమ్మకాలు పెంచుకోవాలంటే స్కూటర్లను ప్రవేశపెట్టాల్సిందే!
ద్విచక్ర వాహన మార్కెట్లో బజాజ్ ఆటో జోరుకు బ్రేకులు పడుతున్నాయి. ఈ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీలు టాప్ 2 స్థానాల్లో కొనసాగుతూ బజాజ్ ఆటోకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రస్తుతం ద్విచక్ర వాహన విభాగంలో స్కూటర్లకు మంచి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, బజాజ్ ఆటో ఇంకా మేలుకోకుండా కేవలం మోటార్‌సైకిళ్ల పైనే ఆధారపడటం కూడా ఈ కంపెనీని ఇతర పోటీదారులు ఓవర్‌టేక్ చేయటానికి మరో కారణం చెప్పవచ్చు.
గడచిన అక్టోబర్ నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు 4 శాతం క్షీణించి 3,48,323 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో అమ్మకాల సంఖ్య 3,61,186 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో వాణిజ్య వాహన విభాగంలో అమ్మకాలు 50,316 యూనిట్ల నుంచి 37,000 యూనిట్లకు పడిపోయి 26 శాతం తగ్గుదలను కనబరించింది.

అక్టోబర్ 2012తో పోల్చుకుంటే అక్టోబర్ 2013లో ఎగుమతులు 1,26,091 యూనిట్ల నుంచి 1,38,022 యూనిట్లకు పెరిగి 9 శాతం వృద్ధిని కనబరచాయి. గడచిన నెలలో ఇక మొత్తం వాహన విక్రయాల విషయానికి వస్తే అవి కూడా 6 శాతం తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 2013లో బజాజ్ ఆటో మొత్తం 3,85,323 వాహనాలను విక్రయించగా, క్రితం సంవత్సరం ఇదే నెలలో ఇవి 4,11,502 యూనిట్లుగా నమోదయ్యాయి. బజాజ్ ఇప్పటికైనా మేలుకొని స్కూటర్ సెగ్మెంట్లోకి తిరిగి ప్రవేశిస్తే అమ్మకాలు మరింత పెరిగే ఆస్కారం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








