బజాజ్ ఆటో ఛాకన్ ప్లాంటులో సమ్మెకు దిగిన కార్మికులు
పూనేకు సమీపంలో ఉన్న బజాజ్ ఆటో ఛాకన్ ప్లాంటులో కార్మికులు సమ్మెకు దిగారు. వేతనాల సవరణ, ఇతర డిమాండ్లను కోరుతూ సుమారు 2000 మంది కార్మికులు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది.
అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. సమ్మె ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఈ విషయంపై కార్మికులతో చర్చించేందుకు బజాజ్ ఆటో యాజమాన్యం నుంచి ఎలాంటి సూచనలు లేవు.
వేతనాల సవరణ, ప్లాంటులో మంచి పని వాతారణాలను ఏర్పాటు చేసే వరకు తమ సమ్మె కొనసాగుతూనే ఉంటుందని, దీనిపై చర్చించేందుకు బజాజ్ యాజమాన్యం తమని పిలువలేదని బజాజ్ ఆటో యూనియన్ వర్గాలు తెలిపాయి.

కాగా ఈ సమ్మె విషయంపై సంప్రదించేందుకు కంపెనీ అధికారులు అందుబాటులో లేదు. ఈ ప్లాంటులో 925 మంది శాస్వత కార్మికులు పనిచేస్తుండగా, 1000 మంది తాత్కాలిక, కాంట్రాక్ట్, ట్రైనీ వర్కర్లు పనిచేస్తున్నారు. ఈ 1000 మంది వర్కర్లు కూడా తమ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ యూనియన్ 25 శాతం వేతనాలను పెంచడంతో పాటు తాత్కాలిక, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరుతుంది. అలాగే సస్పెండ్ చేసిన కొంత మంది ఉద్యోగులను మరియు ఛాకన్ ప్లాంటు నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి ఇదే ప్లాంటుకు పిలిపించాలని కూడా యూనియన్ డిమాండ్ చేస్తోంది.
ఛాకన్ ప్లాంటులో ఏటా 12 లక్షల మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో పల్సర్, అవెంజర్, నిన్జా, కెటిమ్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అసలే కష్టకాలంలో నడుస్తున్న బజాజ్‌కు తాజా సమ్మె ఎలాంటి పరిణామాలను తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








