భారత మార్కెట్లోకి డ్యుకాటి అఫీషియల్ ఎంట్రీ ఖరారు
మోటార్‌సైకిళ్లలో ఫెరారీగా అభివర్ణించే ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ 'డ్యుకాటి' పూర్తిస్థాయిలో అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు మూడవ వ్యక్తి (థర్డ్ పార్టీ డీలర్)పై ఆధారపడి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించిన డ్యుకాటి, ఇకపై స్వతహాగా ఇతర లగ్జరీ బ్రాండ్‌ల మాదిరిగానే భారత్‌లో నేరుగా కార్యకలాపా నిర్వహించనుంది.
వాస్తవానికి డ్యుకాటి 2008లో ప్రెసిషన్ మోటార్స్ అనే స్థానిక థర్డ్ పార్టీ ఇంపోర్టర్, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే, ప్రెసిషన్ మోటార్స్‌తో డ్యుకాటి కుదుర్చుకున్న ఒప్పందం కంపెనీకి ఏమాత్రం లాభం తెచ్చిపెట్టకపోగా, బ్రాండ్‌కు చెడ్డ పేరు తెచ్చింది. సర్వీస్ లోపం, డెలివరీ జాప్యం, కొన్ని సందర్భాల్లో అస్సలు డెలివరీనే చేయకపోవటం వంటి సంఘటనలు జరిగాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, డ్యుకాటి భారత మార్కెట్లో తిరిగి తమ బ్రాండ్ ఇమేజ్‌ను దక్కించుకునేందుకు, పూర్తిస్థాయిలో ఇక్కడి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతుండటంతో, ఇప్పటికే హ్యార్లీ డేవిడ్‌సన్, కవాసకి, కెటిఎమ్ వంటి అనేక లగ్జరీ బ్రాండ్‌లు భారత్‌కు క్యూ కట్టాయి.
భారత మార్కెట్ డ్యుకాటికి అతి ముఖ్యమైన మార్కెట్ అని, ప్రీమియం సేవలు, విస్తృతమైన నెట్‌వర్క్‌లతో ఇక్కడి మార్కెట్లో తమ ప్రస్థానాన్ని మరింత విస్తరింరజేసుకుంటామని డ్యుకాటి వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) క్రిస్టియానో సిలీ తెలిపారు. డ్యుకాటి బ్రాండ్‌ను ఆడి కంపెనీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, భారత్‌లో డ్యుకాటి డీలర్‌షిప్‌లకు ఆడి ఇండియా సహకరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








