లాటిన్ అమెరికా మార్కెట్లలో కాలుమోపిన హీరో మోటోకార్ప్
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇప్పుడు అమెరికన్ మార్కెట్లలో తన హవా కొనసాగించేందుకు సిద్ధమైంది. రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయ వ్యాపారం నుంచి 10 శాతా మార్కెట్ వాటాను దక్కించుకోవాలనే తన లక్ష్యంలో భాగంగా, హీరో మోటోకార్ప్ లాటిని అమెరికా దేశాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది.
ప్రారంభంలో భాగంగా, లాటిన్ అమెరికాలోని ఎల్ సాల్వడార్, హాండ్యురాస్, గౌటమాలా దేశాల్లో హీరో మోటోకార్ప్ తమ అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రారంభించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, లాటిన్ అమెరికాలోని ఈ మూడు దేశాలకు కొద్ది వారాల క్రితమే హీరో మోటోకార్ప్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సెంట్రల్ అమెరికా, సౌత్-ఈస్ట్ ఏషియాలలోని 30 దేశాలకు పైగా తమ కంపెనీను విస్తరింపజేయాలని హీరో మోటోకార్ప్ యోచిస్తోంది.
హీరో హోండా జాయింట్ వెంచర్‌లో హోండాతో భాగస్వామ్యాన్ని తెంచుకొన్న తర్వాత హీరో మోటోకార్ప్ గడచిన ఆగస్ట్ 2011లో తమ గ్లోబల్ బ్రాండ్ ఐడెంటిటీని లండన్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ కంపెనీతో కూడా హీరో మోటోకార్ప్ ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. హీరో గ్లోబల్ మార్కెట్లలో ఎదిగేందుకు ఇలాంటి ఒప్పందాలు చక్కగా సహకరించనున్నాయి.



Click it and Unblock the Notifications








