నష్టాల్లో హీరో మోటోకార్ప్; ఉత్పత్తుల ధరల పెంపు!
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన మార్చ్ 2013 నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను (2012-13) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తోంది. ఏప్రిల్-మార్చ్2013 త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 574.2 కోట్లుగా నమోదైంగి.
ఇదివరకటి ఆర్థిక సంవత్సరం (2011-12)లో ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 603.6 కోట్లను సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఇదే సమయంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 6,146 కోట్లకు చేరింది. కానీ ఈ సమయంలో అమ్మకాలు మాత్రం దాదాపు 3 శాతం తగ్గి 15,27,351 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇక 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కంపెనీ నికర లాభం 11 శాతం తగ్గి రూ. 2,118 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలానికి ఆదాయం రూ. 23,579 కోట్ల నుంచి నామమాత్రంగా పెరిగి రూ. 23,768 కోట్లకు పెరిగింది. గతేడాది ఆటో రంగానికి గడ్డు రోజలు ఎదురయ్యాయని, అయినప్పటికీ 60 లక్షల వాహనాలను విక్రయించగలిగామని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ తెలిపారు.
కాగా, తమ అన్ని మోడళ్ల ద్విచక్ర వాహనాల ధరలను రూ.500 నుంచి రూ.1,500 మధ్య పెంచుతున్నామని, పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








