జనవరిలో మహీంద్రా కొత్త మోటార్‌సైకిళ్ల ఆవిష్కరణ!
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూ వీలర్స్ లిమిటెడ్' (ఎమ్‌టిడబ్ల్యూఎల్) గతంలో మార్కెట్లో విడుదల చేసి, ఆ తర్వాత గేర్ బాక్స్ సమస్య కారణంగా నిలిపివేసిన తమ మొట్టమొదటి 110సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా స్టాలియో' అలాగే, గడచిన కొద్ది సంవత్సరాలుగా విడుదలకు నోచుకోని 300సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో'లు నూతన సంవత్సర కానుకగా బైక్ ప్రియులను అలరించేందుకు ముస్తాబవుతున్నాయి.
మహీంద్రా టూవీలర్స్ తమ స్టాలియో బైక్‌కు మరికొన్ని అదనపు మార్పులు చేర్పులు చేసి 'మహీంద్రా పాంటెరో' అనే సరికొత్త పేరుతో ఈ నెల మొదటి వారంలో దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహీంద్రా స్టాలియో మోటార్‌సైకిల్ విషయంలో గతంలో ఎదురైన సమస్యలను, సవాళ్లను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా టూవీలర్స్ తమ కొత్త పాంటెరోను అభివృద్ధి చేసింది. ఇందులో పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఇంజన్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

రిఫ్రెష్ చేయబడిన మహీంద్రా పాంటెరో (స్టాలియో)ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. మహీంద్రా పాంటెరో ఈ సెగ్మెంట్లోని హోండా డ్రీమ్ యుగ, హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో, సుజుకి హయాటే వంటి 110సీసీ మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ బైక్‌తో పాటుగా మహీంద్రా తమ పవర్‌ఫుల్ 300సీసీ బైక్ మోజోను కూడా జనవరి నెలలోనే ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
స్పోర్టీ డిజైన్ హై పెర్ఫామెన్స్ ఫీచర్లతో రూపొందించిన మహీంద్రా మోజోను గడచిన సంవత్సరం ఢిల్లీలో జరిగిన 2012 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ఇందులో శక్తివంతమైన 292సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్, ఫ్యూయెల్ ఇంజక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 28 పిఎస్‌ల శక్తిని విడుదల చేయనుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు)తో లభిస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని హ్యోసంగ్ జిటి 250ఆర్, హోండా సిబిఆర్ 250ఆర్, నిన్జా 250ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








