ప్రతి మూడు నెలలకు ఓ కొత్త బైక్ విడుదల: టీవీఎస్
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో భారీ మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, టీవీఎస్ తాజాగా ఓ కొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా, ప్రతి త్రైమాసానికి ఒక్కసారి కొత్త బైక్‌ను విడుదల చేస్తామని కూడా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వేను శ్రీనివాసన్ తెలిపారు.
మరోవైపు మిడ్-రేంజ్ స్పోర్ట్స్ బైక్‌లను తయారు చేసేందుకు టీవీఎస్ జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ కంపెనీతో భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకున్న సంగతి తెలిసినదే. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని తాము నిర్ణయించుకున్నామని, ఇందులో భాగంగానే జుపిటర్‌ను విడుదల చేశామని శ్రీనివాసన్ వివరించారు.

ప్రస్తుతం స్కూటర్ల మార్కెట్ దేశీయంగా 14 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోందని, వచ్చే ఏడాది జనవరి నాటికి స్కూటీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా 'స్కూటీ జెస్ట్' అనే కొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని టీవీఎస్ జూపిటర్ స్కూటర్ విడుదల సందర్భంగా ఆయన చెప్పారు.
ప్రత్యేకించి పురుషుల కోసం రూపొందించిన 110 సీసీ స్కూటర్ జూపిటర్ ధరను రూ.44,200 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని, ఇది లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, ప్రస్తుతానికి దీనిని ఉత్తర భారతదేశంలోనే విక్రయిస్తామని, దీపావళి నాటికి దక్షిణాది మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీనివాసన్ వివరించారు. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా యాక్టివా, హీరో మ్యాస్ట్రో, యమహా రే జడ్ వంటి స్కూటర్లతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








