రే స్కూటర్ విడుదలతో పుంజుకున్న యమహా జోరు
జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ 2012 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. యమహా రే విడుదల ద్వారా స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించి యువతుల హృదయాలను దోచుకున్న యమహా, వివిధ వినియోగదారుల సాన్నిహిత్య కార్యక్రాలను నిర్వహించడం ద్వారా కొనుగోలుదారులకు మరింత చేరువ కాగలిగింది. 2012లో యమహా మొత్తం 4,87,290 ద్విచక్ర వాహనాలను విక్రయించి, ఇది వరకటి సంవత్సరంతో పోల్చుకుంటే 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2012లో ఈ అమ్మకాల సంఖ్య 4,60,815 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 2012లో దేశీయ అమ్మకాలు 1.4 శాతం వృద్ధిని సాధించి 3,43,466 యూనిట్ల నుంచి 3,48,406 యూనిట్లకు పెరిగాయి. అలాగే ఎగుమతులు కూడా 21 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 1,17,349 యూనిట్ల నుంచి 1,38,884 యూనిట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి మాట్లాడుతూ.. భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని తాము ప్రవేశపెట్టిన యమహా రే స్కూటర్‌కు మహిళా సమాజం నుంచి మంచి స్పందన లభించిందని, అలాగే ఆధునిక యువత కోసం అందిస్తున్న స్పోర్ట్స్ బైక్‌లకు కూడా మంచి డిమాండ్ ఉండటం వల్లనే ఈ వృద్ధిని సాధించగలిగామని అన్నారు.

యమహా తొలిసారిగా 1985లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యమహా ఇండియాకు ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో తయారైన మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా, పొరగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది. యమహాకు దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్ & ఎస్‌జెడ్-ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc) మరియు రే (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








