నెలకు రూ.10,000ల వరకు వేతనాలు పెంచిన బజాజ్ ఆటో
పూనేకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో ఎట్టకేలకు తమ చాకన్ ప్లాంట్ కార్మికుల వేతనాలను పెంచేందుకు అంగీకరించింది. ఈ ప్లాంట్‌లో గడచిన 18 నెలలుగా వేతనాల విషయమై కార్మికులకు, బజాజ్ ఆటో యాజమాన్యానికి మధ్య చర్చలు, ఆందోళనలు జరిగిన సంగతి తెలిసినదే.
ఏదేమైనప్పటికీ, చివరకు కంపెనీ యాజమాన్యం ఓ మెట్టు దిగొచ్చి కార్మికుల వేతనాలను పెంచేందుకు సిద్ధమైంది. ఈమేరకు ప్రతి కార్మికునికి నెలకు రూ.10,000 వరకు వేతనపు పెంపు పొందే అవకాశం ఉంటుంది. సవరించిన అంగీకారం ప్రకారం ఐదేళ్లు, అంతకు మించి కంపెనీలో పని చేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు జీతం రూ.10,000 వరకు పెరుగుతుంది.

అలాగే, మూడేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం కంపెనీతో ఉన్న వారి వేతనం రూ.9,500 వరకు పెరుగుతుంది. వేతనాల పెంపు విషయంలో చర్చలు ప్రారంభమైర సమయంలో తాము చేసిన ప్రతిపాదనలను చాకన్ యూనియన్ అంగీకరించడం తమకెంతో సంతోషంగా ఉందని, కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ తాజా ఒప్పందం ప్రకారం, సవరించబడిన వేతనంలో 60 శాతాన్ని బేసిక్ పేలోను మిగిలిన 40 శాతాన్ని అలవెన్సుల రూపంలోనూ చూపిస్తారు. చాకన్ ప్లాంట్‌లో 2000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 900 మంది శాశ్వత ఉద్యోగులు. ఈ ప్లాంట్‌లో సాలీనా 1.2 మిలియన్ బైక్‌లు ఉత్పత్తి అవుతాయి. పల్సర్, అవెంజర్, నిన్జా, కెటిఎమ్ బ్రాండ్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.


Click it and Unblock the Notifications








