హీరో మోటోకార్ప్‌లో చేరిన బిఎమ్‌డబ్ల్యూ మాజీ ఆర్ అండ్ డి హెడ్
భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ జపాన్ భాగస్వామి హోండా నుంచి విడిపోయిన తర్వాత, భారత్‌లోనే కాకుండా ప్రపంచ మార్కెట్లలో కూడా తన స్థిరత్వాన్ని నిలుపుకునేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతున్న సంగతి తెలిసినదే.
కేవలం అంతర్జాతీయ సంస్థలనే కాకుండా, ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్‌లలో పనిచేసిన మాజీ ఉద్యోగులను కూడా తమ కంపెనీలో చేర్చుకుంటోంది. తాజాగా హీరో మోటోకార్ప్, ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ సంస్థలోని ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) విభాగానికి హెడ్‌గా పనిచేసిన మార్కస్ బ్రౌన్స్‌పెర్జర్‌ను తమ సంస్థ ఆర్ అండ్ డి హెడ్‌గా నియమించుకుంది.
హీరో మోటోకార్ప్ ఆర్ అండ్ డి విభాగానికి హెడ్‌గా చేరడానికి ముందుగా మార్కస్ జర్మనీలోని బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్ విభాగమైన బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఆర్ అండ్ డి విభాగానికి హెడ్‌గా అనేక సంవత్సరాల పాటు పనిచేశారు. మోటార్‌సైకిళ్లంటే మక్కువ ఉన్న మార్కస్ బిఎమ్‌డబ్ల్యూ ఆర్ అండ్ డి విభాగంతో పాటుగా ప్రొడక్షన్ అండ్ స్ట్రాటజీ విభాగాల్లో కూడా ఉన్నత స్థానాల్లో పనిచేశారు.

జర్మన్ జాతీయుడైన మార్కస్ కేవలం ద్విచక్ర వాహన విభాగంలోనే కాకుండా నాలుగు చక్రాల వాహన విభాగంలో కూడా పనిచేశారు. 5 సిరీస్, 6 సిరీస్, 7 సిరీస్, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7 వాహనాల ప్రాజెక్టులలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. మార్కస్ నేరుగా హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజాల్‌కు రిపోర్టింగ్ చేయనున్నారు.
జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేయనున్న మోడళ్లలో మార్కస్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఆర్ అండ్ డి విభాగంలో ఉన్న 500 మంది ఇంజనీర్లకు ఆయన సారధ్యం వహించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి మార్కస్ నియామకం అమల్లోకి రానుంది.


Click it and Unblock the Notifications








