హీరో మోటోకార్ప్ నుంచి మరో రెండు కొత్త స్కూటర్లు
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మరో ఏడాది కాలంలో రెండు సరికొత్త స్కూటర్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం స్కూటర్ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్ కేవలం రెండు మోడళ్లను (ప్లెజర్, మ్యాస్ట్రో) మాత్రమే విక్రయిస్తోంది. వీటి అదనంగా మరో రెండు కొత్త స్కూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సిఎఫ్ఓ రవి సూద్ వెల్లడించారు. అయితే, ఆ స్కూటర్లు ఏవనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
దేశీయ మార్కెట్లో స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్‌లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హీరో మోటోకార్ప్ సరికొత్త స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ 'డేర్' అనే 110సీసీ స్కూటర్‌తో పాటుగా మరికొన్ని ఇతర స్కూటర్లను ప్రదర్శనకు ఉంచింది. బహుశా, కంపెనీ ముందుగా ఇదే స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఏప్రిల్-సెప్టెంబర్ 2014 మధ్య కాలంలో, భారతదేశంలో స్కూటర్ల అమ్మకాలు దాదాపు 32.11 శాతం వృద్ధి చెందాయి. ఈ సమయంలో స్కూటర్ల అమ్మకాలు 21,90,351 యూనిట్లుగా నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతకు ముందు సంవత్సరంలో ఇదే సమయంలో స్కూటర్ల విక్రయాలు 16,57,920 యూనిట్లుగా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో హీరో మోటోకార్ప్ స్కూటర్ల విక్రయాలలో 5.52 శాతం వృద్ధిని సాధించి అమ్మకాలను 3,33,889 యూనిట్ల నుంచి 3,52,330 యూనిట్లకు పెంచుకుంది.


Click it and Unblock the Notifications








