హీరో మోటోకార్ప్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా టైగర్ ఉడ్స్
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తమ అంతర్జాతీయ మార్కెట్ పరిమితిని పెంచుకునేందుకు విస్తృతంగా చర్యలు చేస్తోంది. ఇందులో భాగంగా, మరిన్ని గ్లోబల్ మార్కెట్లలో తమ ద్విచక్ర వాహనాలను విడుదల చేయటం మరియు వాటిని స్థానికంగా ఆయా దేశాల్లోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేయటం వంటి పనులు చేస్తున్న సంగతి తెలిసినదే.
అయితే, తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులకు మరింత ప్రచారాన్ని కల్పించేందుకు గాను, హీరో మోటోకార్ప్ ప్రముఖ అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం టైగర్ ఉడ్స్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా, హీరో మోటోకార్ప్ ఉత్పత్తులకు టైగర్ ఉడ్స్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. హీరో మోటోకార్ప్ ఇటీవలే అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే.

అక్కడి మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు గాను, టైగర్ ఉడ్స్ పాపులారిటీని హీరో మోటోకార్ప్ ఉపయోగించుకోనుంది. టైగర్ ఉడ్స్ నాలుగేళ్ల పాటు హీరో మోటోకార్ప్‌కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. మరి ఈ డీల్‌కి సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం కంపెనీ బయటకు వెల్లడించలేదు. టైగర్ ఉడ్స్ గ్లోబల్ ఐకాన్ కావటంతో, అతని భారీగానే నజరానా ముట్టి ఉండొచ్చని అంచనా.
డిసెంబర్ 1 నుంచి నాలుగేళ్ల పాటు టైగర్ ఉడ్స్ తమ కార్పోరేట్ భాగస్వామిగా ఉంటారని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ చెప్పారు. కేవలం అమెరికన్ మార్కెట్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా టైగర్ ఉడ్స్ తమ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. టైగర్ ఉడ్స్ 1996లో ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ అయ్యారు, ఇప్పటి వరకూ అతను 106 విజయాలు సాధించారు.


Click it and Unblock the Notifications








