బజాజ్ డామినర్ మీద మళ్లీ పెరిగిన ధరలు
దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ ఫ్లాగ్‌షిప్ మోటార్ సైకిల్ బజాజ్ డామినర్ 400 మీద ధరలు పెంపు చేపట్టింది. తాజాగా జరిగిన ధరల పెంపులో డామినర్ 400 మీద రూ. 2,000 లు పెరిగింది. ఈ ధరలు పెంపు బజాజ్ డామినర్ 400 లభించే రెండు వేరియంట్లకు వర్తిస్తుంది.

ధరల పెంపు అనంతరం బజాజ్ డామినర్ 400 నాన్-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.46 లక్షలు మరియు ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.60 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

రెండు నెలలో వ్యవధిలో డామినర్ 400 మీద ధరలు పెంచడం ఇది రెండవసారి. ఈ ఏడాదిలో మొదటిసారి జరిగిన ధరల పెంపులో రూ. 2,000 ల వరకు పెంచింది. బజాజ్ ఆటో డామినర్ 400 మోటార్‌సైకిల్‌ను తొలుత డిసెంబర్ 2016లో విడుదల చేసింది. అప్పటి నుండి పలుమార్లు చేపట్టిన ధరల పెంపులో మొత్తం రూ. 10,000 వరకు ధరలు పెరిగాయి.

జనవరి 2018లో డామినర్ 400 బైకును పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు రాక్ మ్యాట్ బ్లాక్, గ్రేజియర్ బ్లూ మరియు కెన్యాన్ రెడ్ పెయింట్ స్కీములో పరిచయం చేసింది. డామినర్ 400లో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు మరియు ఆప్షనల్ డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బజాజ్ డామినర్ 400 బైకులో సాంకేతికంగా 373సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 34.5బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సస్పెన్షన్ కోసం ఇందులో ముందు వైపున స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్ ఛార్జ్‌డ్ మోనోషాక్ అబ్జార్ ఉంది. బైకు మొత్తం బరువు 182కిలోలుగా ఉంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 145కిలోమీటర్లు.

బజాజ్ డామినర్ 400 ధరల పెంపు అనంతరం సవరించిన నూతన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ నూతన ధరలను బజాజ్ తమ అఫీషియల్ వెబ్‌సైట్లో కూడా పొందుపరిచింది. అనుకోకుండా జరిగిన ఈ ధరలు పెంపుకు గల కారణాలు తెలియరాలేదు.

వరుసగా ధరల పెంపు చేపడుతుండటంతో ఆశించి మేర డామినర్ సేల్స్ సాధించలేకపోతోంది. మార్చి 2018లో దేశవ్యాప్తంగా కేవలం 1,561 యూనిట్ల డామినర్ బైకులను మాత్రమే విక్రయించగలిగింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డామినర్ 400 ధరలు పెంపుకు గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. డామినర్ 400 ప్రారంభ వేరియంట్ విడుదలైనప్పటి ధర రూ. 1.36 లక్షలు, ఇప్పుడు ఇదే వేరియంట్ ధర రూ. 1.46 లక్షలుగా ఉంది. విడుదలైనప్పటి నుండి ఏకంగా 10,000 రుపాయలు ధర పెరిగింది.
బజాజ్ డామినర్ 400 ప్రస్తుతం విపణిలో ఉన్నమహీంద్రా యుటి300 మోడల్‌కు సరాసరి పోటీనిస్తోంది. కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్ల మీద పరోక్షంగా పోటీపడుతోంది.


Click it and Unblock the Notifications








