దారుణంగా పడిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ 500 బైకుల సేల్స్!
యువతలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. 500 సిరీస్ బైకుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమం లేదు. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ వాడటం నుంచి ఈ బైక్ ఇచ్చే డిఫరెంట్ సౌండ్ వరకు క్లాసిక్ 500 మరియు బుల్లెట్ 500 బైకులకు ఉన్న ప్రత్యేకత మరే బైకులకు లేదు. చెప్పాలంటే వీటికి మార్కెట్లో సరైన పోటీ కూడా లేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ 500 సిరీస్ బైకుల గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ క్రేజీ బైకుల సేల్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే ఎన్నడూలేని విధంగా ఏకంగా 74.16 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. ఇందుకు గల ప్రధాన కారణమేంటో చూద్దాం రండి...

ప్రారంభం నుండి వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉండటం, మార్కెట్లో కొత్త బ్రాండ్ల నుండి విపరీతమైన పోటీ ఉండటం మరియు కంపెనీలోనే అంతర్గతంగా ఒక మోడల్ నుండి మరో మోడల్‌కు పోటీ నెలకొనడం రాయల్ ఎన్ఫీల్డ్ 500 సిరీస్ బైకుల సేల్స్ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

అత్యంత పురాతణ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో రాయల్ ఎన్పీల్డ్ ఒకటి. తన అసలుసిసలైన లక్షణాలను ఏమాత్రం కోల్పోకుండా కొన్ని తరాల పాటు అదే స్టైల్, అదే నూతనత్వం అదే కఠినత్వంతో కూడిన బైకులను నూతన తరానికి అందిస్తూ ఇండియాలో మోస్ట్ పాపులర్ మరియు ఫేవరెట్ మోటార్ సైకిల్ తయారీ సంస్థగా రాయల్ ఎన్ఫీల్డ్ తన స్థానాన్ని పధిలపరుచుకుంది.

సరిగ్గా 2018లో రాయల్ ఎన్ఫీల్డ్ రెండు సరికొత్త బైకులను తన ప్రపంచానికి పరిచయం చేసింది. "కాంటినెంటల్ జిటి 650" మరియు "ఇంటర్‌సెప్టార్ 650" అనే బైకులను స్వల్ప తేడాతో 650 ట్విన్స్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.

అత్భుతమైన సాంకేతికంగా పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రెండు బైకులను అత్యంత పోటీతో కూడిన ధరలతో విడుదల చేసింది. వీటి రాకతో అత్యంత ఖరీదైన బైకులను విక్రయించే సంస్థలు ఒక్కసారిగా డీలా పడిపోయాయి. అవును, అత్యుత్తమ నాణ్యత, అదే తరహా పనితీరు గల 650 ట్విన్ బైకులు హ్యార్లీ డేవిడ్సన్ ఎంట్రీ లెవల్ బైకుల ధరలో సగం ధరకే లభించడంతో ఆయా సంస్థల సేల్స్ ఏకంగా 50 శాతం పడిపోయాయి.

కానీ రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైకుల సేల్స్ దెబ్బకు ఇతర సంస్థల సేల్స్ పడిపోవడమే కాకుండా తమ లైనప్‌లో ఉన్న ఇతర ఉత్పత్తులకు కూడా వీటి అమ్మకాల సెగ తగిలింది. మే 2018తో పోల్చుకుంటే మే 2019లో 650 ట్విన్ బైకులు 500 సిరీస్ సేల్స్ తినేశాయి.

మే 2018లో 383 యూనిట్ల థండర్‌బర్డ్ 500, 397 యూనిట్ల బుల్లెట్ 500 మరియు 2,368 యూనిట్ల క్లాసిక్ 500 బైకులు అమ్ముడైతే, అదే మే నెల 2019లో 133 యూనిట్ల థండర్‌బర్డ్ 500, 140 యూనిట్ల బుల్లెట్ 500 మరియు 612 యూనిట్ల క్లాసిక్ 500 బైకులు మాత్రమే అమ్ముడయ్యి వరుసగా 65.27%, 64.74% మరియు 74.16 శాతం నష్టాన్ని చవిచూశాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 మరియు 500 సిరీస్ బైకుల మధ్యలో ధరలో భారీ వ్యత్యాసమేమీ ఉండదు. అయితే, 650 ట్విన్స్‌తో పోల్చుకుంటే 500 బైకులు బేసిక్ మోడల్స్. ఇటీవల వీటిలో ఏబీఎస్‌ను జోడించింది, అన్ని బైకుల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన ప్రభుత్వ నిర్ణయానికి రాయల్ ఎన్పీల్డ్ ప్రేమికులు థ్యాంక్స్ చెప్పుకోవాలి.

పాత డిజైన్ ఎలిమెంట్స్, విపరీతమైన వైబ్రేషన్స్, తక్కువ పవర్ అవుట్‌పుట్ మరియు కఠినమైన 5-స్పీడ్ గేర్‌బార్స్ 500 సిరీస్ బైకుల నైజం, వీటితో పోల్చుకుంటే 650 ట్విన్ మోడళ్లు ఎంతో స్మూత్‌గా ఉంటాయి. అవసరానికి తగ్గట్లుగా పవర్ ఇచ్చే శక్తివంతమైన ట్విన్ సిలిండర్ ఇంజన్, కంఫర్ట్ మరియు ధరకు తగ్గ విలువలు వీటి సొంతం.

రాయల్ ఎన్ఫీల్డ్ 500 సిరీస్ బైకులతో పోల్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో పాటు 650 ట్విన్ బైకులు కేవలం రూ. 50,000 వరకు మాత్రమే ఖరీదైనవి. ఎంతో మంది కస్టమర్లు మరో 50 వేల రూపాయలు వెచ్చించడానికి వెనకాడకుండా 650 ట్విన్ సిరీస్ మోడళ్లను ఎంచుకుంటున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎంతో కాలంగా 350 మరియు 500 సిరీస్ మోడళ్లనే విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎంతో శ్రమ మరియు పెట్టుబడిని వెచ్చించి అంతర్జాతీయ దిగ్గజాలను సైతం ఢీకొనే విధంగా అత్భుతమైన 650 ట్విన్ బైకులను అభివృద్ది చేసి, మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు ఇతర కంపెనీల సేల్స్ తినేయడమే కాకుండా తమతో పాటు ఉండే 500 సేల్స్‌కు గండికొట్టాయి.
దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ 500 సిరీస్ మోడళ్ల సేల్స్ పెంచుకునేందుకు వీటిని పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ చేసి రీలాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే థండర్‌బర్డ్ మోడల్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ పనిచేస్తోంది.
"రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల గురించి ఏవైనా ప్రశ్నలుంటే క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.."


Click it and Unblock the Notifications








