విపణిలోకి టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్: పండుగ ప్రత్యేకం!
టీవీఎస్ మోటార్స్ విపణిలోకి స్టార్ సిటీ+ బైకును స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేసింది. సరికొత్త 2019 టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 53,437 ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో దీనిని ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

సరికొత్త టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్ మోడల్ రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. సాధారణ మోడల్‌తో పోల్చుకుంటే ఇది డ్యూయల్ టోన్ తెలుపు లేదా నలుపు రంగుల్లో ఎంతో కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది.

అదనపు కలర్ ఆప్షన్‌ల పరిచయంతో పాటు సౌకర్యవంతమైన ప్రీమియం-డ్యూయల్ టోన్ సీటు, డ్యూయల్ టోన్ సైడ్ మిర్రర్లు, రెడ్ కలర్ బాడీ డీకాల్స్ అదే విధంగా స్పెషల్ ఎడిషన్ లోగో మరియు కలర్ జోడింపుతో కూడిన షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్ కమ్యూటర్ బైకులో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్, హనికాంబ్ సైడ్ ప్యానల్స్, స్టెయిన్ స్టీల్ సైలెన్సర్ మఫ్లర్స్, అల్యూమినియం రియర్ హ్యాండిల్, బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, 3డీ చిహ్నాలు, గుర్తులు, మరియు అత్యంత స్టైలిష్ టెయిల్ లైట్లు ఉన్నాయి.

సాంకేతికంగా టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్ బైకులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులోని 110సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టీవీఎస్ వారి చౌకైన కమ్యూటర్ బైక్ స్టార్ సిటీ+లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఐదు దశలవారీగా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయమున్న షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి రెండు చక్రాలకు 110ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు అందించారు. అదే విధంగా ఇరువైపులా 17-అంగుళాల టైర్లను అందించారు, మెరుగైన గ్రిప్ కోసం ట్యూబ్ లెస్ బటన్ టైప్ టైర్లను కూడా అందిస్తున్నారు.

సరికొత్త టీవీఎస్ స్టార్ సిటీ+ స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్‌తో పాటు ఈ పండుగ సీజన్ పూర్తయ్యేనాటికి వీలైనంత బిజినెస్ చేసుకోవడానికి మరిన్ని మోడళ్లను ప్రత్యేకమైన ఎడిషన్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అపాచే ఆర్‌టిఆర్ సిరీస్ బైకులను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు భారీ అప్‌డేట్లతో రానున్న తొలి మోడల్‌గా నిలవనుంది. 2020 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌ను అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులోనే తొలిసారిగా అందివ్వనున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
భారతీయ వాహన పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కుంటోంది. టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ల కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. అయితే పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సేల్స్ పెంచుకోవాలని భావిస్తున్న వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను కాస్త కొత్తగా విభిన్నంగా తీర్చిదిద్ది స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా టీవీఎస్ పలు మోడళ్లను స్పెషల్ ఎడిషన్‌లో లాంచ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








