టీవీఎస్ ఐక్యూబ్‌ని ఓవర్‌టేక్ చేసిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
భారతదపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీల్లో ఒకటైన 'బజాజ్ ఆటో' ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్లో తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతానికి ఈ స్కూటర్ కేవలం బెంగుళూరు, పూనే నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దశల వారీగా ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇది ఈ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోటీ పడుతుంది. బజాజ్ ఆటో విడుదల చేసిన నివేదిక ప్రకారం, గడచిన జులై 2020 నెలలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 120 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల కన్నా అధికంగా ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా, బజాజ్ చేతక్ మాదిరిగానే హోసూర్‌కి చెందిన టీవీఎస్ కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ప్రస్తుతానికి బెంగళూరు నగరంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ల కారణంగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో ఆశించిన రీతిలో అమ్మకాలను సాగించలేకపోయాయి. మరోవైపు వీటి లభ్యత కూడా కేవలం ఒకటి రెండు నగరాలకు పరిమితం కావటం కూడా అమ్మకాల తగ్గుదలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'అర్బన్ ధర రూ.1 లక్షగా ఉంటే టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'ప్రీమియం' ధర రూ.1.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించనున్నారు.

మోడ్రన్ రెట్రో డిజైన్‌ల కలయికతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కాలపు బజాజ్ చేతక్‌ను తలపించేలా మోడ్రన్ స్టయిల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇది బజాజ్‌కు తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐపి67 గుర్తింపు పొందిన 3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

ఇంకా ఇందులో ముందు వైపు సింగిల్ సైట్ ట్యూబ్యులర్ సస్పెషన్ మరియు వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. అలాగే బ్రేక్స్ విషయానికి వస్తే, ముందు వైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇందులో పెద్ద 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.
ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్లూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 2.25 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌లో గరిష్టంగా 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ రెండు మోడళ్లూ కూడా ఆయా బ్రాండ్‌లకు మార్కెట్లో మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ భారత మార్కెట్లో ప్రీమియం ధరను, ఫీచర్లను కలిగి ఉన్నాయి.
Source:Gaadiwaadi


Click it and Unblock the Notifications