హీరో డెస్టినీ 125 బీఎస్6 స్కూటర్ లాంచ్: ధర రూ. 64,310
హీరో మోటోకార్ప్ సరికొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్‌ను బీఎస్6 వెర్షన్‌లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త హీరో డెస్టినీ 125 బీఎస్6 స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధర రూ. 64,310 గా నిర్ణయించారు. ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ ధరలో లభించే 125సీసీ స్కూటర్‌గా నిలిచింది.

హీరో డెస్టినీ 125 LX మరియు VX రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర 66,800 రూపాయలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. రెండు వేరియంట్లలో ఒకేతరహా ఇంజన్ అందించారు. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే బీఎస్6 హీరో డెస్టినీ మైలేజ్ స్వల్పంగా పెరిగింది.

హీరో డెస్టినీ 125 స్కూటర్‌లో సాంకేతికంగా 124సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బీఎస్6 ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 9బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో మోటోకార్ప్ కథనం మేరకు, బీఎస్4 డెస్టినీతో పోల్చుకుంటే బీఎస్6 వెర్షన్ డెస్టినీ స్కూటర్ మైలేజ్ 11శాతం పెరిగింది. మునుపటి మోడల్‌లో ఉన్నటువంటి కార్బోరేటర్ స్థానంలో అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్ అందించారు.

సాంకేతికంగా జరిగిన మార్పులు మినహాయిస్తే, డిజైన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే గతంలో లభించే స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ సీట్, క్రోమ్ ఎలిమెంట్స్, మొబైల్ ఛార్జింగ్ మరియు అండర్ సీట్ స్టోరేజీ క్యాబిన్‌లో వచ్చిన బూట్ లైట్ వంటి ఫీచర్లు యధావిధిగా వచ్చాయి.

హీరో డెస్టినీ 125 స్కూటర్ హీరో లైనప్‌లో ఉన్నటువంటి మాయెస్ట్రో ఎడ్జ్ 125 తరహాలోనే ఉంటుంది, యువ కస్టమర్ల లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. స్లిమ్ మరియు స్పోర్టివ్ డిజైన్ దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైమ్ స్కూటర్ కొనే కస్టమర్లకు హీరో డెస్టినీ బెస్ట్ ఛాయిస్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ మార్కెట్లోని 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత సరసమైన స్కూటర్ హీరో డెస్టినీ 125 స్థానం సంపాదించుకుంది. అత్యుత్తమ పర్ఫామెన్స్, మైలేజ్ మరియు పవర్ అవుట్‌పుట్ మినహాయిస్తే కొత్తగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.
హీరో డెస్టినీ 125 బీఎస్6 స్కూటర్ విపణిలో ఉన్న సుజుకి యాక్సస్ 125(సెగ్మెంట్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్), హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు ఇటీవల విడుదలైన యమహా ఫ్యాసినో 125 బీఎస్6 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








