భారీగా పెరిగిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర; బుకింగ్స్ నిలిపివేత!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే కంపెనీ తిరిగి ఈ మోడల్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కూడా భారీగా పెంచింది.

బజాజ్ చేతక్ ఈవీ కోసం ఏప్రిల్ 13, 2021న బుకింగ్స్ ప్రారంభించారు. కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ నిలిపివేశారు. అలాగే, ఈ స్కూటర్ ధరను ఇప్పుడు రూ.27,000 మేర పెంచారు. తాజా ధరల పెంపుతో ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.42 లక్షలు (అర్బన్) మరియు రూ.1.47 లక్షలు (ప్రీమియం)గా ఉన్నాయి.

పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. గడచిన మార్చి 2021లో బజాజ్ ఆటో తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచింది. గతంలో బేస్ వేరియంట్ అయిన అర్బన్ ధరను రూ.15,000 మేర పెంచగా, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ప్రీమియం ధరను రూ.5,000 మేర పెంచారు.

ఇదివరకు బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ ధర రూ.1.15 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.20 లక్షలుగా ఉండేది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్). కాగా, ఇప్పుడు ఈ మోడల్ ధరను మరోసారి రూ.27,000 పెంచడంతో ఇది ఈ విభాగంలోనే అత్యంత ఖరీదైన స్కూటర్‌గా మారింది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ ధర కన్నా అధికంగా ఉంటుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ కస్టమర్ల నుండి రిజిస్ట్రేషన్లను మాత్రమే స్వీకరిస్తోంది. గతేడాది నుండి ఇప్పటి వరకూ ఈ స్కూటర్ కోసం సుమారు 50,000కి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకూ కంపెనీ 1,000 యూనిట్లకు పైగా డెలివరీ చేసింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగించే కొన్ని విడిభాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కారణంగా, బజాజ్ ఆటో తమ స్కూటర్ తయారీకి కావల్సిన విడిభాగాల సరఫరాలో అంతరాయాన్ని ఎదుర్కుంటోంది. ఫలితంగా చేతక్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.

ఈ కారణం చేతనే బజాజ్ ఆటో తమ చేతక్ బుకింగ్స్‌ను నిలిపివేసింది. బజాజ్ ఆటో చేతక్ ఈవీని తొలిసారిగా జనవరి 2020లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్ పూణే మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే లభిస్తోంది. ఈ స్కూటర్‌ను దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో విడుదల చేయాలన్ని కంపెనీ ప్లాన్‌కు కరోనా మహమ్మారి ఆటంకం కలిగించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు.

బజాజ్ చేతక్ ఈవీలో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూటర్‌లోని ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 1 గంట చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది చూడటానికి రెట్రో-మోడ్రన్ స్టైల్ స్కూటర్‌లా అనిపిస్తుంది.

బజాజ్ చేతక్ ఈవీ ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు త్వరలో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. తాజా ధరల పెంపుతో ఈ స్కూటర్ కోసం వచ్చిన రిజిస్ట్రేషన్లలో ఎన్ని బుకింగ్స్‌గా మారుతాయనేది వేచి చూడాలి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








