భారీగా పెరిగిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు; కొత్త ధరల జాబితా!
భారతదేశపు ప్రముఖ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో, గడచిన సంవత్సరం ఆరంభంలో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'బజాజ్ చేతక్' ధరలను కంపెనీ భారీగా పెంచింది. వేరియంట్‌ను బట్టి ఈ స్కూటర్ ధరలు రూ.15,000 వరకూ పెరిగాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన అర్బన్ ధరలు రూ.15,000 మేర పెరగగా, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ప్రీమియం ధరలు రూ.5,000 మేర పెరిగాయి. ధరల పెరుగుదల అనంతరం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి:
* బజాజ్ చేతక్ అర్బన్ : రూ.1.15 లక్షలు
* బజాజ్ చేతక్ ప్రీమియం : రూ.1.20 లక్షలు
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్)

తాజా ధరల పెంపుకు ముందు ఈ రెండు వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.1 లక్ష మరియు రూ.1.15 లక్షలుగా ఉండేవి. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంపిక చేసిన నగరాల్లో బజాజ్ కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

గడచిన జనవరి 2021 నాటికి ఈ స్కూటర్ కోసం 50,000 మందికి పైగా కస్టమర్లు వేచి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకానిక్ నేమ్‌ప్లేట్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ఈ విభాగంలో ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు త్వరలో రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

బజాజ్ ఆటో సంస్థ నుండి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ఈవీలో ఐపి67 గుర్తింపు పొందిన 4 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 16 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్, స్కూటర్‌లో అమర్చిన 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్‌లో ఇకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఇందులోని బ్యాటరీలను 1 గంట పాటు చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

రెట్రో మోడ్రన్ డిజైన్ మరియు ఐకానిక్ చేతక్ నేమ్‌ప్లేట్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్ వంటి కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

చేతక్ ఎలక్ట్రిక్ అర్బన్ వేరియంట్ సిట్రస్ రష్ మరియు సైబర్ వైట్ అనే రెండు రకాల కలర్ ఆప్షన్స్‌లో, అదే విధంగా ప్రీమియం వేరియంట్ హజల్‌నట్, బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, వెలుట్టో రొస్సో మరియు ఇండిగో మెటాలిక్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








