జులై 31 వరకూ కెటిఎమ్, హస్క్వార్నా టూవీలర్లపై సర్వీస్ మరియు వారంటీ పొడగింపు
భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో, పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లను మరియు కర్ఫ్యూలను విధిస్తున్నాయి. దీంతో మోటారిస్టులు ఎటూ వెళ్లలేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో కొత్త వాహనాల ఉచిత సర్వీసులు మరియు వారంటీల గడువు కూడా ముగిసిపోతోంది.

ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఆస్ట్రియన్ టూవీలర్ బ్రాండ్ కెటిఎమ్ తమ మోటార్‌సైకిళ్ల యొక్క సర్వీస్ మరియు వారంటీ గడువు తేదీలను జులై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. కెటిఎమ్‌తో పాటుగా స్వీడిష్ టూవీలర్ బ్రాండ్ హస్క్వార్నా మోటార్‌సైకిళ్ల వారంటీని కూడా జులై 31 వరకూ పొడగించారు.

భారత మార్కెట్లో కెటిఎమ్ మరియు హస్క్వార్నా టూవీలర్ బ్రాండ్ల కార్యకలాపాలను బజాజ్ ఆటో నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా బజాజ్ ఆటో అధ్యక్షుడు (ప్రోబైకింగ్) సుమిత్ నారంగ్ మాట్లాడుతూ, "కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ కారణంగా, చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి, ఈ పరిస్థితుల్లో వినియోగదారులు తమ వాహనాలను సమయానికి సర్వీస్ చేయించుకోలేక పోతున్నారు."

"ఈ పరిస్థితిలో, అన్ని కెటిఎమ్ మరియు హస్క్వర్నా మోటార్‌సైకిళ్ల ఉచిత సర్వీస్ మరియు వారంటీని మరో రెండు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించామని" ఆయన చెప్పారు. కరోనా కారణంగా కంపెనీ ఇటీవల తం ప్రో ఎక్స్‌పీరియన్స్ రైడ్‌ను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసినదే. ఈ రైడ్‌లో పాల్గొనే బైకర్లను ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కంపెనీ సూచించింది.

కాగా, ఈ ఉచిత సేవలు మరియు వారంటీ పొడగింపు దేశవ్యాప్తంగా ఉన్న కెటిఎమ్ మరియు హస్క్వార్నా వినియోగదారులందరికీ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. మే 31, 2021వ తేదీ నాటికి సర్వీస్ లేదా వారంటీ ముగిసే వాహనాలకు ఇది వర్తిస్తుంది. కరోనా కారణంగా గత నెల నుండి దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసినదే.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండటం మరియు కోవిడ్-19 మహమ్మారి యొక్క అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని కేవలం ఒక రాష్ట్రానికి లేదా ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా కంపెనీ దేశవ్యాప్తంగా వర్తింప జేయనుంది.

కెటిఎమ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త 500సీసీ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త 500సీసీ బైక్‌లో ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

పూణేలోని బజాజ్ ఆటో ప్లాంట్‌లో ఈ కొత్త 500సీసీ బైక్‌ను తయారు చేయనున్నారు. కెటిఎమ్ సబ్ బ్రాండ్ అయిన హస్క్వార్నా కూడా ఈ కొత్త 500సీసీ బైక్ అభివృద్ధిలో భాగం పంచుకోనుంది. ప్రస్తుతం కెటిఎమ్ మార్కెట్లో విక్రయిస్తున్న 390సీసీ బైక్‌కు ఎగువన ఈ కొత్త 500సీసీ బైక్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








