రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. కొత్త Hero Xpulse 200 4V వచ్చేసింది: ధర రూ. 1.28 లక్షలు మాత్రమే
ప్రముఖద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp (హీరో మోటోకార్ప్) భారత మార్కెట్లో కొత్త Hero Xpulse 200 4V (హీరో ఎక్స్ ప్లస్ 200 4వి) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Hero Xpulse 200 4V బైక్ కొంతకాలం క్రితం టెస్టింగ్ సమయంలో సమయంలో కనిపించింది, అయితే ఇప్పుడు కంపెనీ దీనిని అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019 సంవత్సరంలో, కంపెనీ ఈ బైక్‌ను మొదటిసారిగా భారతీయ మార్కెట్లో విడుదల చేసిందని.

అయితే ప్రస్తుతం కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ కంపెనీ యొక్క మూడవ వెర్షన్. కంపెనీ మొదటి ఈ విభాగంలో బిఎస్ 4 వెర్షన్ మోడల్ ప్రారంభించింది. తరువాత కాలంలో ఈ మోడల్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారయ్యింది.

ఇప్పుడు ఈ కొత్త BS6 వెర్షన్ బైక్ లో ఆయిల్-కూలర్ వంటి కొన్ని కొత్త అప్‌డేట్‌లను అందుకుంది. కావున ఇంజిన్ మరింత అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Hero Xpulse 200 4V బైక్ ఇప్పుడు 199.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు 2-వాల్వ్ OHC కి బదులుగా 4-వాల్వ్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త ఇంజిన్లోని 4-వాల్వ్ సెటప్ ఇంజిన్ అధిక RPM ల వద్ద మెరుగైన గాలిని తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా బైక్ నుండి మెరుగైన టాప్-ఎండ్ పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పుడు 19.1 బిహెచ్‌పి పవర్ మరియు 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇక దీని 2-వాల్వ్ సెటప్ విషయానికి వస్తే, ఇది ఈ బైక్ యొక్క పాత ఇంజిన్, కావున ఇది 18.1 బిహెచ్‌పి పవర్ మరియు 16.45 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందించింది. అయితే ఇప్పుడు అప్డేట్ చేయబడిన ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ అప్డేటెడ్ స్విచ్ గేర్ కూడా కలిగి ఉంటుంది. అంతే కాకుండా Xtreme 160R వంటి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ మరియు కిల్ స్విచ్‌ను పొందుతుంది.

ఇప్పుడు కొత్త Hero Xpulse 200 4V యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్ కి సమానంగా ఉంటుంది. కానీ దాని ట్యాంక్‌లో '4V' స్టిక్కర్ వంటికి గమనించవచ్చు. అంతే కాకుండా ఇది మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలతో వస్తుంది. ఇందులో ట్రైల్ బ్లూ, బ్లిట్జ్ బ్లూ మరియు రెడ్ రైడ్ ఉన్నాయి.

కొత్త Hero Xpulse 200 4V బైక్ లో ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరింత ప్రకాశవంతంగా ఉన్నాయి. దీనితో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లు మరియు ఒక సింగిల్ ఛానల్ ABS తో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.

ఈ బైక్ లోని సస్పెన్షన్ సెటప్, వీల్స్ మరియు టైర్లు వంటి భాగాలలో ఎలాంటి మార్పులు చేయబడలేదు. అయితే ఇందులోని సస్పెన్షన్ కోసం, ముందుభాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చబడి ఉంటుంది. వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఇవ్వబడింది. Xpulse 200 4V అదే 21 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ వీల్ కాంబోను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 90/90-21 టైర్లు మరియు వెనుక భాగంలో 120/80-18 టైర్లు ఉన్నాయి.

హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఈ కొత్త బైక్ కోసం రూ. 46,000 వద్ద స్పెషల్ ‘ర్యాలీ కిట్' అందిస్తోంది. ఇందులో మాక్స్సిస్ ఆఫ్-రోడ్ టైర్లు, ముందు మరియు వెనుకవైపు ర్యాలీ-ట్యూన్డ్ సస్పెన్షన్, ఒక ఫ్లాట్ మరియు పొడవైన ర్యాలీ-స్టైల్ బెంచ్ సీటు, హ్యాండిల్‌బార్ రైసర్స్, లాంగ్ సైడ్ స్టాండ్ మరియు ఎక్స్‌టెండెడ్ గేర్ పెడల్ వంటివి ఉన్నాయి. ర్యాలీ-ట్యూన్ సస్పెన్షన్‌ను ఉపయోగించిన ఫలితంగా, గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు 275 మిమీ ఉంటుంది. కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త బైక్ ని ఇప్పటికే ఉన్న హీరో Xpulse 200 మోడల్ రేంజ్‌తో విక్రయించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








