మళ్ళీ తగ్గిన Royal Enfield 2021 అక్టోబర్ సేల్స్: కారణం అదేనా?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఈ కంపెనీ మార్కెట్లో ప్రారంభమైనప్పటినుంచి కూడా మంచి ఆదరణతో ముందుకు సాగుతోంది. కంపెనీ కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తో తమ బైకులను విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీ గత నెల (2021 అక్టోబర్) తన అమ్మకాల నివేదికను విడుదల చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2021 అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లో 40,611 మోటార్‌సైకిళ్లను విక్రయించినట్లు తెలిసింది. అయితే కంపెనీ 2020 అక్టోబర్ నెలలో 62,858 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కూడా నివేదికల ద్వారా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం అక్టోబర్ అమ్మకాల కంటే ఈ ఏడాది అక్టోబర్ అమ్మకాలు 35 శాతం తగ్గాయి.

దేశీయ మార్కెట్లో విక్రయాలు మాత్రమే కాకుండా, భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడిన ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 3,522 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. అయితే ఇదే నెల గత సంవత్సరం 4,033 యూనిట్లను ఎగుమతి చేయగలిగింది. కావున గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఎగుమతులలో 13 శాతం తగ్గుదల కనిపిస్తుంది.

Royal Enfield కంపెనీ యొక్క గత నెల మొత్తం అమ్మకాలు (దేశీయ మరియు ఎగుమతి) 44,133 యూనిట్లుగా ఉన్నాయి, 2020 సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన మొత్తం అమ్మకాలు 66,891 యూనిట్లు. మొత్తానికి ఈ సంవత్సరం కంపెనీ 34 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

గత నెల మాత్రమే కాకుండా కంపెనీ 2021 సెప్టెంబర్ నెలలో కూడా భారీ తగ్గుదలనే చవి చూసింది. కంపెనీ నివేదికల ప్రకారం సెప్టెంబర్ 2021లో మొత్తం 33,529 యూనిట్ల బైక్‌లను విక్రయించి మునుపటికంటే 44 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం, గ్లోబల్ సెమీకండక్టర్ సంక్షోభం మరియు కరోనా మహమ్మారి ప్రభావం అని కంపెనీ తెలిపింది.

అయితే విజయదశమి కంపెనీ యొక్క అమ్మకాలను పెంచలేకపోయినా, రానున్న దీపావళి మరియు ఇతర పండుగలు కంపెనీ యొక్క అమ్మకాలను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా త్వరలో సెమీకండక్టర్ల కొరత కూడా తగ్గుతుంది అని ఆశిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే విడుదల చేసిన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం అమ్మకాలలో దాదాపు 60 నుంచి 70 శాతం వరకు క్లాసిక్ 350 బైకులు ఉన్నట్లు తెలుస్తుంది. Royal Enfield Classic 350 బైక్ దేశీయ మార్కెట్లో 2009 లో ప్రారభించినప్పటినుంచి దాదాపు 3 మిలియన్ మోటార్ సైకిల్స్ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైక్ కి ఎంత క్రేజు ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు.

Royal Enfield కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో 2021 Royal Enfield Classic 350 బైక్ ను రూ. 1.84 లక్షలకు విడుదల చేసింది. 2021 Royal Enfield Classic 350 బైక్ ఇప్పుడు దేశీయ మార్కెట్లో 5 వేరియంట్లలో తీసుకురాబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా మరియు ఆధునిక ఫీచర్స్, పరికరాలను కలిగి ఉంటుంది.

Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Classic 350 బైక్ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ కొత్త బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త బైక్ మునుపటికంటే కూడా అద్భుతమైన మరిన్ని కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త Royal Enfield Classic 350 బైక్ Honda Highness CB350, Jawa వంటి వాటికి మాత్రమే కాకుండా Royal Enfield Meteor 350 కి కూడా ప్రత్యర్దిగా ఉంటుంది. మొత్తానికి కంపెనీ ఈ నెలలో మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








