రాజధానిలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; ధర మరియు ఇతర వివరాలు
చెన్నైకి చెందిన టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ గతేడాది జనవరి నెలలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్'ను తాజాగా దేశ రాజధానిలో విడుదల చేసింది. ఢిల్లీ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్-రోడ్ ధర రూ.1.08 లక్షలుగా ఉంది.

ఢిల్లీలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఫేమ్ 2 పథకం క్రింద ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చు. ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో కానీ లేదా డీలర్‌షిప్‌లలో కానీ రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటి వరకూ తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం బెంగుళూరు మార్కెట్లో మాత్రమే విక్రయించేంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ స్కూటర్ ప్రారంభించిన సరిగ్గా ఎడాది తర్వాత ఈ కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెండవ మార్కెట్‌గా ఢిల్లీని ఎంచుకుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విడుదలైంది. ఇది ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2020 జనవరిలో బెంగళూరులో ప్రవేశపెట్టారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో నడుస్తుంది. ఇందులో అమర్చిన 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో ఈ ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పూర్తి ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో లభిస్తుంది. దీని సాయంతో స్కూటర్‌కు సంబంధించిన అనేక విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవటం మరియు కంట్రోల్ చేయటం చేయవచ్చు.

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, పెద్ద టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ 'స్విచ్ ఢిల్లీ' పేరిట ఓ క్యాంపైన్‌ను ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ఢిల్లీ మార్కెట్లో విడుదల కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Click it and Unblock the Notifications








