40 ఎలక్ట్రిక్ స్కూటర్లతో వెళ్తున్న ట్రక్కులో మంటలు, 20 పూర్తిగా దగ్ధం.. ఇంతకీ ఇవి ఏ బ్రాండ్ స్కూటర్లంటే..?
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని ఎలక్ట్రిక్ స్కూటర్లను కొందామనుకుంటే, మంటల్లో కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలుదారులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నట్టుండి మంటల్లో కాలిపోతున్న సంఘటను భారీగా పెరుగుతున్నాయి. గడచిన నాలుగు వారాల్లో ఇలాంటివి ఐదు సంఘటనలు నమోదయ్యాయి. తాజాగా, 40 ఎలక్ట్రిక్ స్కూటర్లతో వెళ్తున్న ఓ ట్రక్కులో దాదాపు 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

ప్రస్తుతం, భారతదేశంలో ఇదే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ఫైర్ యాక్సిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సంఘటన నాసిక్‌లో జరిగింది. జితేంద్ర ఈవీ (Jitendra EV) అనే ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీకి చెందిన ఓ డెలివరీ ట్రక్కు 40 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఫ్యాక్టరీ నుండి బయలుదేరింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను రాష్ట్రంలోని డీలర్‌షిప్‌లకు పంపిణీ చేయడానికి కంపెనీ ఓ రెండు వరుసల ట్రక్కులో లోడ్ చేసింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ ఫ్యాక్టరీ గేటు దాటిన కొద్దిసేపటికే ట్రక్కులోని పై వరుసలో మంటలు వ్యాపించాయి.

క్షణాల్లో ట్రక్కులోని పై వరుసలో ఉన్న 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతై పోయాయి. ఈ సంఘటనకు చెందిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. నివేదికల ప్రకారం, ఈ స్కూటర్లు నాసిక్‌లోని జితేందర్ ఈవీ ఫ్యాక్టరీ నుండి రవాణా చేయబడుతున్నాయి. కంటైనర్‌లో మొత్తం 40 జితేంద్ర ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి మరియు ఎగువ డెక్‌లో 20 స్కూటర్లు మంటల్లో కాలిపోతుండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన ఏప్రిల్ 9 న జరిగినట్లుగా చెబుతున్నారు మరియు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రమాదం పట్ల అప్రమత్తమైన తమ బృందం సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం ద్వారా పరిస్థితిని తక్షణమే అదుపులోకి తీసుకురాగలినట్లు పేర్కొంది. తమ వాహనాలలో భద్రతే ప్రధానమైనందున, తాము ఈ ప్రమాదానికి గల మూల కారణాన్ని పరిశీలిస్తున్నామని జితేందర్ ఈవీ మీడియాకు తెలిపింది. బహుశా ఓవర్‌హీట్ అయిన బ్యాటరీలు లేదా కేబుల్ హార్‌నెస్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాధమిక అంచనా.

గత నెలలో వేసవి ప్రారంభమైనప్పటి నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్నిప్రమాదం జరగడం ఇది ఐదవ సంఘటన. మార్చి 26న పూణెలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. అదే రోజు, తమిళనాడులోని వెల్లూరులో ఇంట్లో చార్జ్ చేస్తున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోయి ఒక వ్యక్తి మరియు అతని 13 ఏళ్ల కుమార్తె మరణించారు. ఈవీలో అగ్నిప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం ఇది రెండోసారి. డిసెంబర్ 2021లో, రాత్రి సమయంలో ఛార్జ్ అవుతున్న కార్గో స్కూటర్ నుండి వచ్చిన మంటల కారణంగా ఓ 60 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మానేసర్‌కు చెందిన హెచ్‌సిడి ఇండియా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేసింది.

మార్చి 28న తమిళనాడులో మరో స్కూటర్‌లో మంటలు చెలరేగాయి, ఆ తర్వాత మార్చి 29న చెన్నైలో ఓ ప్యూర్ ఈవీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు వ్యాపించాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఇలా తరచూ అగ్ని ప్రమాదాలకు గురవతుండటంతో, వాటి భద్రత విషయంలో ప్రజలకు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎలక్ట్రిక్ టూవీరల్లలో మంటలు వ్యాపించడానికి గల కారణాలను పరిశోధించి, ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది.

సీఎఫ్‌ఈఈఎస్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క రక్షణ ప్రయోగశాల. జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగిన ఘటనపై మరింత మంది నిపుణులతో కూడిన బృందాన్ని నియమించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బృందంలో NSTL వైజాగ్, CFEES, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన సభ్యులు ఉన్నారు. వీరు ఇటీవలి ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాల సంఘటనలను సంబంధించిన కారణాలను పరిశోధించనున్నారు.
కారణం ఏమైనప్పటికీ, ఎలక్ట్రిక్ స్కూటర్‌లు తరచూగా ఇలా మంటలు కాలిపోవడం అనేది ఖచ్చితంగా ఓ భయానక సంఘటన మరియు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న కొనుగోలుదారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తుంది. తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ టూవీలర్ల నాణ్యతా ప్రమాణాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ టూవీలర్ల పరీక్ష, ప్రమాణాలు, తయారీ, నిల్వ మరియు రవాణాతో సహా భారతదేశ ఈవీ పర్యావరణ వ్యవస్థ యొక్క సమగ్ర సమీక్షను ప్రభుత్వం నిర్వహించాలని చూస్తోంది. సర్టిఫికేషన్ అవసరం లేని తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా రెగ్యులేటరీ ప్రాసెస్‌లోకి ఎలా తీసుకురావాలో అనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల భద్రతను మెరుగుపరచడానికి మరియు భారతదేశం యొక్క ఈవీ స్వీకరణను మరింత ముందుకు తీసుకురావడానికి ఏమి చర్యలు తీసుకోవచ్చో చర్చించడానికి ప్రభుత్వం కంపెనీలు, నిపుణులు మరియు టెస్టింగ్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది.


Click it and Unblock the Notifications








