రైడింగ్‌కి సిద్దమేనా.. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ వచ్చేసింది: ధర రూ. 2.85 లక్షలు
"బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్" (BMW Motorrad) కంపెనీ భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 2022 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్' (BMW G310 RR) మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ స్టైల్ స్పోర్ట్ వేరియంట్' ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

"బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్" (BMW Motorrad) యొక్క 2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ ఆధునిక డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది. కావున ఇది బైక్ రైడర్లకు మరింత అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇప్పటికే కంపెనీ ఈ లేటెస్ట్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అయితే మొదట బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీ చేయబడతాయి. కస్టమర్లు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

కంపెనీ భారతీయ మార్కెట్లో ఈ బైక్ కొనుగోలు కోసం కంపెనీ అద్భుతమైన ఫైనాన్స్ స్కీమ్స్ కూడా తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేవలం రూ. 3,999 ఈఎమ్ఐ ద్వారా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా సహాయపడుతుంది.

"బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్" యొక్క ఈ కొత్త బైక్ ఆధునిక ఫీచర్స్ పొందటమే కాకుండా ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి వైట్ మరియు బ్లాక్ కలర్స్. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ మోటార్ సైకిల్బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, రేక్డ్ విండ్‌స్క్రీన్, గోల్డెన్ కలర్ లో USD ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్ వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 5-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి కావాల్సిన సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది.

2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ 312.2 సిసి లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన సింగిల్-సిలిండర్ ఇంజన్‌ని పొందుతుంది. ఇది 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 33.52 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ట్రాక్, అర్బన్, రెయిన్ మరియు స్పోర్ట్స్ మోడ్స్. ఈ బైక్ కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో షోవా USD ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్‌తో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది.
ఈ బైకులో బ్రేకింగ్ సిస్టం మరింత షార్ప్ గా పనిచేస్తుంది. దీనికోసం కంపెనీ ఈ బైక్ యొక్క ముందు వైపున 300 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్స్ అందించింది. అంతే కాకుండా ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది. కావున బ్రేకింగ్ అద్భుతంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల బిఎండబ్ల్యు మోటోరాడ్ మార్కెట్లో 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 5,000 ఎక్కువ. ఇది మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది కూడా చాలా వరకు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో రోజురోజులై బైక్ ప్రేమికుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, ఈ కారణంగానే కంపెనీలు కూడా ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో ఎప్పటికప్పుడు కొత్త బైకులను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తన జి310 ఆర్‌ఆర్ విడుదల చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది, కావున మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతుందా లేదా అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








