ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పోటీగా AMO Jaunty Plus ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; పూర్తి చార్జ్‌పై 120 కిమీ రేంజ్!
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు తమ సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. తాజాగా, దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఆమో ఎలక్ట్రిక్ బైక్స్ (AMO Electric Bikes) తమ సరికొత్త లాంగ్ రేంజ్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆమో జాంటీ ప్లస్ (AMO Jaunty Plus)ను మార్కెట్లో విడుదల చేసింది. బ్రష్‌లెస్ డిసి మోటార్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ ఈ స్కూటర్ ను తయారు చేసింది.

సింగిల్ చార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 120 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఆమో ఎలక్ట్రిక్ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 140 డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి. కాగా, తమ కొత్త జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ డీలర్‌షిప్ ల ద్వారా ఫిబ్రవరి 15వ తేదీ నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి సాంప్రదాయ పెట్రోల్ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఇది ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆధునిక సాంకేతికతను కలిగి ఉంటుంది.

ఆమో జాంటీ ప్లస్ (AMO Jaunty Plus) ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న జాంటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించబడిన అడ్వాన్స్డ్ వెర్షన్ గా చెప్పవచ్చు. ఇందులో షార్ప్-లుకింగ్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్ ఉంటుంది మరియు ఇది స్కూటర్ ఫ్రంట్ కౌల్ మధ్యలో అమర్చబడి ఉంచబడింది. ఇందులోని ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్ బార్ లో అమర్చబడి ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు వైపు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో ఉన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. పిలియన్ రైడర్ సౌలభ్యం కోసం వెనుక వైపు మందపాటి బ్లాక్ గ్రాబ్ రైల్ ఉంటుంది. అధిక ధృడత్వం కోసం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బలమైన ఛాసిస్‌పై నిర్మించింది. ఈ స్కూటర్ యొక్క సైడ్ మరియు రియర్ డిజైన్ చాలా సింపుల్ గా మరియు అంతే స్టైలిష్ గా కనిపిస్తుంది. డ్యూయెల్ టోన్ షేడ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఆమో జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సాంకేతిక వివరాలను గమనిస్తే, ఇందులో పోర్టబుల్ 60 V/40 Ah అధునాతన లిథియం బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది అధిక-పనితీరు గల బ్రష్‌లెస్ డిసి ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేస్తే, ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 120 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే, DC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం నాలుగు గంటల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

అదనంగా, ఇందులోని బ్రష్‌లెస్ డిసి మోటార్ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగంపై ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. అయితే, ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంటుందని మాత్రం కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఫిబ్రవరి 15వ తేదీన వెలువడే అవకాశం ఉంది.

కాగా, జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలాంటి ప్రత్యేక సాంకేతికతలను అందిస్తున్నారనే విషయాన్ని అమో ఎలక్ట్రిక్ విడుదల చేసింది. ఈ ఇ-స్కూటర్‌లో సైడ్ స్టాండ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెల్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి అత్యాధునిక సాంకేతికత ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా, జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఇంజన్ కిల్ స్విచ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫిక్స్ మరియు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మూడు సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. ఆమో జాంటీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఇందులో ఆమో జాంటీ ప్లస్ రెడ్ - బ్లాక్, గ్రే - బ్లాక్, బ్లూ - బ్లాక్, వైట్ - బ్లాక్ అండ్ ఎల్లో - బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల సందర్భంగా, ఆమో ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుశాంత్ కుమార్ మాట్లాడుతూ, అధునాతన సాంకేతికతతో తయారు చేయబడిన జాండీ ప్లస్ ఎకో-ఫ్రెండ్లీ ఇ-స్కూటర్‌ను భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌కు పరిచయం చేయడం తమకెంతో సంతోషంగా ఉందని, ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో అత్యుత్తమ ఉత్పత్తులలో ఇది కూడా ఒకటిగా ఉంటుందని, స్టైలిష్ డిజైన్, డిజిటల్ డిస్‌ప్లే, హై సెక్యూరిటీ ఫీచర్లు, సూపర్ స్పీడ్ మరియు గరిష్ట రేంజ్‌తో ఇది ద్విచక్ర వాహన ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications








