ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్.. మెగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమైన ఏథర్ ఎనర్జీ!
భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పెట్రోల్ ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఏథర్ ఎనర్జీ (Ather Energy) భారతదేశంలో తమ అతిపెద్ద తయారీ కర్మాగారాన్ని నిర్మించాలని యోచిస్తోంది.

ఏథర్ ఎనర్జీకి ప్రస్తుతం భారతదేశంలో రెండు తయారీ కర్మాగారాలు ఉన్నాయి, ఇవి రెండూ కూడా తమిళనాడులోని హోసూర్‌లో ఉన్నాయి. బెంగుళూరుకి చెందిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ యొక్క మొదటి తయారీ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల యూనిట్లు కాగా, రెండవ తయారీ కర్మాగారం వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 2.8 లక్షల యూనిట్లు. మొత్తంగా ఈ రెండు ప్లాంట్లు కలిసి వార్షికంగా 4 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలవు.

అయితే, ఏథర్ ఎనర్జీ ఇంకా తమ రెండవ తయారీ ప్లాంట్‌లో వాహనాల ఉత్పత్తిని ప్రారంభించలేదు. కాగా, ఇప్పుడు కంపెనీ తమ మూడవ తయారీ కర్మాగారం కోసం, 100 ఎకరాల భూమిని వెతుకుతోంది మరియు ఈ కొత్త మెగా ప్లాంట్ సంవత్సరానికి 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. ఏథర్ ఎనర్జీకి ఈ మూడవ తయారీ కర్మాగారం అతిపెద్ద ఈవీ తయారీ కేంద్రం అవుతుంది.

ఏథర్ ఎనర్జీ తమ మూడవ తయారీ కర్మాగారం ఏర్పాటు కోసం ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు గుజరాత్ వంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయడం మరియు గరిష్ట స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ విభాగంలో ఇప్పటికే రాజ్యమేళుతున్న ఓలా ఎలక్ట్రిక్, హీరో ఎలక్ట్రిక్, ఓకినావా వంటి ఎలక్ట్రిక్ కంపెనీలకు ఏథర్ ఎనర్జీ గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

ఏథర్ ఎనర్జీ (Ather Energy) ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 1,52,401 మరియు రూ. 1,33,391 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, విజయవాడ) లుగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) అత్యంత పాపులర్ అయిన ప్రీమియం స్కూటర్ మరియు ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్.

ఏథర్ 450 బేస్ వేరియంట్ 22Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేసే 5.4 kW ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ మోటార్ 2.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇకపోతే, 450ఎక్స్ ప్రీమియం వేరియంట్ 26Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన 6kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తుంది మరియు ఇది పెద్ద 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది.

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ (సర్టిఫైడ్ రేంజ్) పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది ఫాస్ట్ మరియు స్టాండర్డ్ చార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. అలాగే, 3 గంటల 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అంతర్నిమిత (బిల్ట్-ఇన్) ఆటో కట్-ఆఫ్ మరియు సర్జ్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది చార్జ్ పూర్తవగానే ఆటోమేటిక్ పవర్ తీసుకోవడాన్ని నిలిపివేస్తుంది ఫలితంగా ఓవర్‌హీటింగ్ సమస్యను నివారిస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో యూజర్లు తమ స్కూటర్ యొక్క బ్యాటరీ స్థితిని కుడా రిమోట్‌గా చెక్ చేసుకోవచ్చు. కంపెనీ ఇటీవలే ఈ స్కూటర్ల కోసం కొత్త స్మార్ట్ ఎకో (SmartEco) మోడ్ ను ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా విడుదల చేసింది.

ఈ కొత్త ఎకో మోడ్ ఇప్పటికే ఆయా స్కూటర్లలో అందుబాటులో ఉన్న మునుపటి ఎకో (Eco) మోడ్‌ను భర్తీ చేస్తుంది. రైడర్లు తమ స్కూటర్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ OTA అప్‌డేట్‌ను పొందవచ్చు. ఏథర్ ల్యాబ్స్ దీన్ని క్రమంగా కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం, ఏథర్ ఇ-స్కూటర్ లలో ఉన్న ఎకో మోడ్‌ని ఉపయోగించడం వలన రైడర్లు ఇతర మోడ్‌లలో కన్నా ఎక్కువ రేంజ్‌ను పొందుతారని కంపెనీ చెబుతోంది.

ఈ రెండు వేరియంట్లలోని బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కూడా IP67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కంపెనీ ఈ బ్యాటరీ ప్యాక్ పై 3 ఏళ్ల అపరిమిత వారంటీని అందిస్తుంది. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నాలుగు రైడింగ్ మోడ్స్ (స్మార్ట్‌ఎకో, రైడ్, స్పోర్ట్స్ మరియు వార్ప్) ఉంటాయి. ఇది పూర్తి చార్జ్‌పై ఎకో మోడ్‌లో 85 కిమీ, రైడ్ మోడ్‌లో 70 కిమీ, స్పోర్ట్స్ మోడ్‌లో 60 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. వార్ప్ మోడ్‌లో ఈ స్కూటర్ దాని సర్టిఫై చేసిన గరిష్ట వేగంతో (గంటకు 80 కిమీతో) పరుగులు తీస్తుంది. ఈ మోడ్‌లో రేంజ్ ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








