కొంటే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొనాలంటున్న కస్టమర్లు.. మే నెలలో ఎంత మంది కొన్నారంటే..?
బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో మంచి పేరు ఉంది. ఇప్పటి వరకూ దాదాపు అన్ని బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లపై పలు వివాదాలు వచ్చినప్పటికీ, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రాలేదు. దీంతో ఈ బ్రాండ్ పట్ల కస్టమర్లు కూడా ఎక్కువగా ఆకర్షితలవుతున్నారు. ఈ నేపథ్యంలో, గడచిన మే 2022 నెలలో ఏథర్ ఎనర్జీ అమ్మకాలు జోరందుకున్నాయి.

ఏథర్ ఎనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం, గడచిన మే నెలలో కంపెనీ మొత్తం 3,787 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది ఇప్పటి వరకూ కంపెనీ విక్రయించిన అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం. గడచిన ఏప్రిల్‌తో పోలిస్తే ఇది భారీ పెరుగుదల కానప్పటికీ, కంపెనీ అమ్మకాలు మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఏప్రిల్ 2022 నెలలో ఏథర్ ఎనర్జీ మొత్తం 3,779 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అలాగే, మార్చి 2022 నెలలో 2,591 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది.

ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 1,52,401 మరియు రూ. 1,33,391 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, విజయవాడ) లుగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) అత్యంత పాపులర్ అయిన ప్రీమియం స్కూటర్. ఇందులో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 116 కి.మీ సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ IP67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కంపెనీ దీనిపై 3 ఏళ్ల అపరిమిత వారంటీని అందిస్తుంది. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నాలుగు రైడింగ్ మోడ్స్ (స్మార్ట్‌ఎకో, రైడ్, స్పోర్ట్స్ మరియు వార్ప్) ఉంటాయి. రైడర్ ఎంచుకునే మోడ్ ను బట్టి ఇ-స్కూటర్ రేంజ్ మారుతూ ఉంటుంది.

చార్జింగ్ టైం విషయానికి వస్తే, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా చార్జ్ చేసుకోవచ్చు. అలాగే, 3 గంటల 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో అంతర్నిమిత (బిల్ట్-ఇన్) ఆటో కట్-ఆఫ్ మరియు సర్జ్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది చార్జ్ పూర్తవగానే ఆటోమేటిక్ పవర్ తీసుకోవడాన్ని నిలిపివేస్తుంది ఫలితంగా ఓవర్‌హీటింగ్ సమస్యను నివారిస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో యూజర్లు తమ స్కూటర్ యొక్క బ్యాటరీ స్థితిని కుడా రిమోట్‌గా చెక్ చేసుకోవచ్చు.

కంపెనీ ఇటీవలే ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఫీచర్ ను కూడా ప్రారంభించింది. ఈ ఫీచర్ స్కూటర్‌లో అదనపు యాక్సెసరీగా అందుబాటులో ఉంటుంది, దీని కోసం కస్టమర్‌లు అదనంగా రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏథర్ ఎనర్జీ తన వాహనాల్లో ఈ వ్యవస్థను అందించిన భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారుగా నిలిచింది. ప్రీమియం స్కూటర్ రేంజ్‌లో లభిస్తున్న ఓలా ఎస్1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో కూడా TPMS ఫీచర్ అందుబాటులో లేదు.

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ ఇటీవలే తమ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను భారతీయ నగరాల్లో అందుబాటులో ఉంచడానికి ప్రముఖ ఈవీ ఛార్జింగ్ కంపెనీ Magenta ChargeGridతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, భారతదేశం అంతటా బహుళ మెజెంటా ఛార్జ్‌గ్రిడ్ స్థానాలకు ఏథర్ యాక్సెస్‌ని అందిస్తుంది. Magenta ChargeGrid ప్రస్తుతం భారతదేశంలోని 35-40 నగరాలలో తమ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. కాగా, ఈ కంపెనీ FY2023 చివరి నాటికి దాదాపు 11,000 ఛార్జర్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది.

ఏథర్ ఎనర్జీ కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయంపై మాత్రమే కాకుండా, ప్రారంభం నుండి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను నిర్మించడంపై చురుకుగా పనిచేస్తోంది. ఏథర్ ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లు కేవలం ఏథర్ వినియోగదారులకు మాత్రమే కాకుండా, బహుళ బ్రాండ్లకు చెందిన ఎలక్చ్రిక్ స్కూటర్లను కూడా సపోర్ట్ చేసేలా వీటిని రూపొందిస్తోంది. ప్రస్తుతం, ఏథర్ దేశంలోని 35 నగరాల్లో 330 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది.

ఏథర్ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌లో ఉన్న ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం ఒక నిమిషంలో 1.5 కి.మీ నడపడానికి ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ చెబుతోంది. రాబోయే 3 సంవత్సరాలలో, ఏథర్ ఎనర్జీ భారతదేశం అంతటా 5,000 ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








