బ్రేకులు వేయకుండా దూసుకుపోతున్న ఏథర్ ఎనర్జీ.. ఈ బ్రాండ్ బ్యాటరీ స్కూటర్లకు భలే డిమాండ్!
బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), ఇటీవల తమ మూడవ తరం 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కొత్త స్కూటర్ రాకతో మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.
Recommended Video
గడచిన ఆగస్టు 2022 నెలలో 6,410 యూనిట్ల 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

జులై 2022 నెలలో ఏథర్ ఎనర్జీ విక్రయించిన 2,389 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో మొత్తం అమ్మకాలు 297 శాతం వృద్ధిని నమోదు చేశాయి. నాలుగేళ్ల క్రితం ఓ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రధానమైన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతోంది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం మార్కెట్లో ఒకే ఒక మోడల్ 450ఎక్స్ (Ather 450X) ని మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో స్టాండర్డ్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ అనే వేరియంట్లలో లభిస్తుంది.

ఏథర్ ఎనర్జీకి తమిళనాడులోని హోసూర్ లో ఓ పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ప్లాంట్ నుండి ఇటీవలే తమ 50,000వ యూనిట్ ను కంపెనీ బయటకు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పూర్తి చేసింది. 50 నెలల్లో ఏథర్ ఈ ఘనత సాధించింది. ఏథర్ ఎనర్జీ 2018 సంవత్సరంలో తొలిసారిగా ఏథర్ 450ఎక్స్ ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఏథర్ ఎనర్జీ కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

ఏథర్ ఎనర్జీ కొత్తగా విడుదల చేసిన 2022 ఏథర్ 450ఎక్స్ జెన్ 3 (2022 Ather 450X Gen 3) మోడల్ దాని పాత మోడల్ కన్నా ఎక్కువ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ఈ అప్‌గ్రేడ్‌లలో అదనపు ఫీచర్లు, పెద్ద మరియు మెరుగైన బ్యాటరీ మేనేజ్‌మెంట్, మరింత ఎక్కువ రేంజ్ మరియు మెరుగైన పనితీరు వంటి అంశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మరియు ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి.

దేశంలో మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు కంపెనీ ఇటీవలే పూణే, చెన్నై మరియు రాంచీలలో మూడు కొత్త అనుభవ కేంద్రాలను కూడా ప్రారంభించింది. అమ్మకాలను పెంచుకునేందుకు మరియు తమ కస్టమర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు సరసమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించడానికి ఏథర్ ఎనర్జీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో కూడా ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, రెండవ తరం మోడల్‌కో పోలిస్తే ఈ కొత్త 2022 మోడల్ డిజైన్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, యాంత్రికంగా ఇందులో భారీ మార్పులు చేయబడ్డాయి. పాత తరం ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చేది. ఇది పూర్తి చార్జ్ పై కేవలం 116 కిమీ సర్టిఫైడ్ రేంజ్ మరియు 85 కిమీ రియల్ టైమ్ రేంజ్‌ను మాత్రమే ఆఫర్ చేసేది. రేంజ్ విషయంలో వినియోగదారుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ తమ జెన్ 3 మోడల్ బ్యాటరీ సామర్థ్యాన్ని మరియు రేంజ్ ను రెండింటినీ పెంచింది.

ఈ కొత్త తరం 2022 ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ లో కంపెనీ పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది మరియు పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను మరియు ఎకో మోడ్ లో 105 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ కేవలం 19 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది మరియు ఏథర్ 450ఎక్స్ యొక్క పాత బ్యాటరీ ప్యాక్ తో పోలిస్తే, ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు 25 శాతం మెరుగ్గా ఉంటుంది మరియు 20 శాతం అదనపు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

అయితే, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. కానీ, బ్యాటరీ ప్యాక్ లో చేసిన మార్పు కారణంగా, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ మోటార్ మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇందులోని 6kW ఎలక్ట్రిక్ మోటార్ ఇప్పుడు 26 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సగటున ఓ 350సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ విడుదల చేసే టార్క్ తో సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని ఉపయోగించే డిస్‌ప్లే యూనిట్ యొక్క ర్యామ్ సామర్థ్యాన్ని కంపెనీ 2జిబికి పెంచింది. ఫలితంగా, ఈ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇప్పుడు మరింత రెస్పాన్సివ్‌గా ఉంటుంది. ఏథర్ 450ఎక్స్ ఈ విభాగంలో సింపుల్ వన్, ఓలా ఎస్1 ప్రో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








